శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 02:22:56

ఐపీఎల్‌లో మనమిలా

ఐపీఎల్‌లో మనమిలా

  • తగ్గిన హైదరాబాద్‌ ప్లేయర్ల ప్రాతినిధ్యం
  • టోర్నీ మొత్తం ముగ్గురు మాత్రమే  

ప్రపంచంలోనే ప్రముఖ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు తహతహలాడుతుంటారు. బోర్డుకు ఆదాయంతో పాటు దేశవాళీ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం లాంటి లక్ష్యాలతో బీసీసీఐ ప్రతి ఏటా ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నది. ఈ టోర్నీలో అదరగొట్టి జాతీయ జట్లలో చోటు దక్కించుకున్న ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇంతటి ముఖ్యమైన టోర్నీలో హైదరాబాద్‌ ఆటగాళ్ల ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉంది. టోర్నీలో ఎనిమిది జట్లు ఉండగా.. కేవలం ముగ్గురంటే ముగ్గురే హైదరాబాద్‌ నుంచి చోటు దక్కించుకున్నారు. అంబటి రాయుడు(చెన్నై సూపర్‌ కింగ్స్‌), మహమ్మద్‌ సిరాజ్‌(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), బవనక సందీప్‌(సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌) మాత్రమే టోర్నీలో ఉన్నారు. అదే దక్షిణాది రాష్ర్టాలైన కర్ణాటక,తమిళనాడు నుంచి చెరో 9 మంది ఆటగాళ్లు వివిధ ఐపీఎల్‌ జట్లలో ఉన్నారు. చిన్న రాష్ట్రమైన కేరళ నుంచి కూడా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. 

సన్‌రైజర్స్‌లో సందీప్‌  ఒక్కడే ..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెప్పుకోవడానికి స్థానిక జట్టే అయినా ఆల్‌రౌండర్‌  సందీప్‌ ఒక్కడే లోకల్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. అతడు టీమ్‌తో ఉన్నా.. తుదిజట్టులో ఒక్కసారి కూడా అవకాశమే రాలేదు. ప్రియమ్‌ గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ.. ఇలా ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కినా.. హైదరాబాదీ సందీప్‌ వైపు యాజమాన్యం దృష్టి సారించలేదు. ఫ్రాంచైజీకి మెంటార్‌గా హైదరాబాద్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉన్నా.. సందీప్‌కు ఆడే అవకాశం రాకపోవడం శోచనీయం. 

హెచ్‌సీఏ మేల్కోవాల్సిందే.. 

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)లో కొన్నేండ్లుగా కొనసాగుతున్న అనిశ్చితి ఆటగాళ్లపై ప్రభావం చూపుతున్నది. లోకల్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించడంలో నిర్లక్ష్యం వల్ల యువ ఆటగాళ్లలోని ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. రంజీతో పాటు వివిధ ఏజ్‌ గ్రూప్‌ జట్లకు ప్లేయర్ల ఎంపికపై కూడా విమర్శలు ఎదుర్కొంటున్నది. 2019-20 సీజన్‌ రంజీ ట్రోఫీ గ్రూప్‌-బిలో హైదరాబాద్‌ ఘోరమైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో లోకల్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించడంతో పాటు సరైన చర్యలు తీసుకుంటేనే ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నిరూపించుకునే అవకాశం దక్కుతుందని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రంజీ సీజన్‌ హెచ్‌సీఏకు ఓ హెచ్చరిక లాంటిదని, ఇప్పటికైనా మేల్కొని పూర్వ వైభవం తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు. 

సిరాజ్‌ ‘సూపర్‌' 

హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించడం సంతోషించాల్సిన విషయం. అతడు కొన్నేండ్లుగా ఐపీఎల్‌లో ఉన్నా పరుగులు ధారాళంగా ఇస్తుండడంతో నిలకడగా చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ సారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లీగ్‌ మ్యాచ్‌లో పరుగు ఇవ్వక ముందే మూడు వికెట్లు పడగొట్టి, ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఇక చెన్నై తరఫున రాయుడు సైతం ఈసారి ఫర్వాలేదనిపించాడు. 12 మ్యాచ్‌ల్లో ఓ అర్ధశతకంతో 359 పరుగులు చేశాడు.