ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 02, 2020 , 02:02:15

బయో బబుల్‌ దాటితే వేటే : బీసీసీఐ

 బయో బబుల్‌ దాటితే వేటే  : బీసీసీఐ

  • జరిమానాలు, చర్యలను వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆటగాళ్లు, ఫ్రాంచైజీలపై తీసుకునే చర్యలను బీసీసీఐ వెల్లడించింది. ఒకవేళ మూడుసార్లు బబుల్‌ దాటితే ఆటగాళ్లను టోర్నీ నుంచి బహిష్కరించనుంది. అలాగే ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని కలిసేందుకు ఎవరైనా బయటి వ్యక్తులను బబుల్‌లోకి అనుమతిస్తే ఫ్రాంచైజీలకు జరిమానా, పాయింట్ల కోత సైతం విధించనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు గురువారం పంపింది. అలాగే రోజువారీ ఆరోగ్య వివరాలు తెలుపకపోవడం, జీపీఎస్‌ ట్రాకర్‌ను ధరించకపోవడం, కరోనా పరీక్షను మిస్‌ కావడం చేస్తే రూ.60వేల జరిమానా పడుతుందని, జట్ల సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ యువ పేసర్‌ కేఎం ఆసిఫ్‌ బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించాడన్న వాదనలను ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్‌ తిరస్కరించారు. జట్టు బస చేస్తున్న హోటల్‌లోని రిసెప్షన్‌లోకి వెళ్లి సాధారణ వ్యక్తులతో అతడు మాట్లాడాడన్న వార్తలను ఖండించారు. 

ఆటగాళ్లు బయోబబుల్‌ దాటితే.. 

తొలిసారి ఆరు రోజుల క్వారంటైన్‌ 

రెండోసారి ఓ మ్యాచ్‌ నిషేధం  

మూడోసారి టోర్నీ నుంచి బహిష్కరణ

(రీప్లేస్‌మెంట్‌ లేకుండా)

ఇతర వ్యక్తులను బబుల్‌లోకి ఫ్రాంచైజీ తీసుకొస్తే.. 

తొలిసారి రూ. కోటి జరిమానా 

రెండోసారి జట్టు ఖాతాలో ఓ పాయింట్‌ కోత 

మూడోసారి రెండు పాయింట్ల కోత