మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 15:25:13

ధోని ఐపీఎల్‌ ఎంతకాలం ఆడతాడు? అప్‌డేట్‌ ఇచ్చిన సీఎస్‌కే

ధోని ఐపీఎల్‌ ఎంతకాలం ఆడతాడు? అప్‌డేట్‌ ఇచ్చిన సీఎస్‌కే

గతేడాది ప్రపంచ కప్ సెమీఫైనల్ నుంచి ఇప్పటివరకు క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం 2021, 2022 ఎడిషన్‌లలో కూడా సీఎస్‌కే ఫ్రాంచైజీలో భాగమవుతాడని చెన్నై జట్టు సీఈఓ కాసి విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. 39 ఏండ్ల ధోని ఈ ఏడాది యూఏఈలో జరుగబోయే ఐపీఎల్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. 

‘‘ఎంఎస్ ధోని ఐపీఎల్‌ 2020, 2021 రెండింటిలో భాగమని మేము ఆశిస్తున్నాం. బహుశా తరువాతి సంవత్సరం 2022 వరకు కూడా ఆయన జట్టులో ఉండవచ్చు'' అని విశ్వనాథన్ ఇండియాటుడే.ఇన్‌కు తెలిపాడు. ‘‘ధోని ప్రస్తుతం ఇండోర్‌ నెట్స్‌లో శిక్షణ పొందుతున్నాడని మీడియా ద్వారా తెలిసింది. కానీ మేము మా బాస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టు బాధ్యతల గురించి అతడికి తెలుసు. జట్టును అతను చూసుకుంటాడు.’’ అని విశ్వనాథన్‌ తెలిపాడు. 2021 ఐపీఎల్‌ వేలంలో సీఎస్‌కే ధోనిని నిలబెట్టుకుంటుందని జట్టు ఫ్రాంచైజీ యజమాని, ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ జనవరిలో చెప్పారు. 2019 ప్రపంచకప్ తరువాత ధోనికి బీసీసీఐ నుంచి పిలుపు రాకపోవడంతో అతడి భవిష్యత్‌ గురించి అభిమానుల్లో ఊహాగానాలు చెలరేగాయి.

ధోని కూడా నిశ్శబ్దంగా ఉండగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ కరోనా కారణంగా వాయిదా పడకముందే చెపాక్‌లో ధోని ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఇదిలా ఉండగా సీఎస్‌కే ఆగస్టు 16 నుంచి 20 వరకు ఒక చిన్న శిక్షణా శిబిరాన్ని ప్లాన్ చేసింది. ఆగస్టు 21న యూఏఈకి బయలుదేరాలని సీఎస్‌కే ఆశిస్తుండగా, ఆగస్టు 14న ఆటగాళ్లందరూ చెన్నైలో సమావేశమవుతారని విశ్వనాథన్ ధృవీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo