శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 00:43:00

ఒలింపిక్‌ బెర్తుల కోసం..

 ఒలింపిక్‌ బెర్తుల కోసం..

అమన్‌(జోర్డాన్‌): టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు భారత బాక్సర్లు సిద్ధమయ్యారు. మంగళవారం ఇక్కడ ప్రారంభం కానున్న ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంగాల్‌(52కేజీలు) టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనుండగా.. మహిళల 51కేజీల విభాగంలో దిగ్గజ బాక్సర్‌ మేరికోమ్‌ రెండో సీడ్‌గా పోటీ పడనుంది. పురుషుల విభాగంలో భారత్‌ నుంచి మొత్తం ఎనిమిది మంది, మహిళల విభాగంలో ఐదుగురు పోటీలో ఉన్నారు. మహిళల కేటగిరీలో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహెన్‌(69కేజీలు), పూజా రాణి(75కేజీలు) వరుసగా రెండు, నాలుగు సీడ్‌లుగా పోటీలోకి దిగనున్నారు. టోర్నీకి ముందు ఇటలీలో ప్రాక్టీస్‌ చేసిన మన బాక్సర్లు ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పురుషుల విభాగంలో అమిత్‌తో పాటు మనీశ్‌ కౌశిక్‌(63కేజీలు)పైనా భారీ అంచనాలు ఉన్నాయి.  కాగా, చైనాలోని వుహాన్‌లో ఈ అర్హత పోటీలు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ కారణంగా జోర్డాన్‌కు వేదిక మారిన సంగతి తెలిసిందే. 
logo