ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 17:19:11

చెలరేగిన దీపక్‌ హుడా

చెలరేగిన దీపక్‌ హుడా

అబుదాబి: ప్లేఆఫ్‌  ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కీలక బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆఖర్లో దీపక్‌ హుడా(63 నాటౌట్‌: 30 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో   పంజాబ్‌  పోరాడే స్కోరు సాధించింది. 

లుంగి ఎంగిడి(3/39) నిప్పులు చెరగడంతో  పంజాబ్‌ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది.  ఓపెనర్లు  కేఎల్‌ రాహుల్‌(29), మయాంక్ అగర్వాల్‌(26) మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌(12), నికోలస్‌ పూరన్‌(2), మన్‌దీప్‌ సింగ్‌(14) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, తాహిర్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. 

మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించింది. ఐతే దూకుడుగా ఆడే క్రమంలో   ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(26) ఎంగిడి బౌలింగ్‌లో  వెనుదిరిగాడు. దీంతో 48 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది.  పవర్‌ప్లే ఆఖరికి పంజాబ్‌  53/1తో మెరుగైన స్థితిలో నిలిచింది  మళ్లీ ఎంగిడి బౌలింగ్‌లో  రాహుల్‌(29)  ఔట్‌ కావడంతో  స్కోరు వేగం తగ్గింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రమాదకర హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌(2) ఎక్కువసేపు నిలువలేదు. 

ఈ దశలో క్రీజులో ఉన్న క్రిస్‌గేల్‌(12) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. తాహిర్‌ వేసిన 12వ ఓవర్లో గేల్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరగడంతో పంజాబ్‌ భారీస్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. 13 ఓవర్లకు 77/4తో ఉన్న జట్టును హుడా ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా భారీషాట్లు ఆడాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లు రెండు సిక్సర్లు కొట్టి 16 పరుగులు రాబట్టాడు.  ఆ తర్వాతి ఓవర్‌లోనే  26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.  ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును 150 దాటించాడు.