సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 02:16:14

అకాడమీల అడ్డా..పాలమూరు

అకాడమీల అడ్డా..పాలమూరు

వనపర్తిలో హాకీ.. మహబూబ్‌నగర్‌లోవాలీబాల్‌ అకాడమీ

  • అల్లీపురంలో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం
  • ప్లేయర్లను తీర్చిదిద్దడమే లక్ష్యం
  • క్రీడాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పాలమూరు సాంస్కృతిక వారసత్వానికే కాదు క్రీడల కార్ఖానగానూ కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభ చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీ ఏదైనా పతకం పక్కా అనే రీతిలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. హాకీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. 2017లో వనపర్తిలో హాకీ అకాడమీ ప్రారంభించగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వాలీబాల్‌ అకాడమీని తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. చిన్నచింతకుంట మండలం అల్లీపురంలో బ్యాడ్మింటన్‌ స్టేడియం నిర్మాణం శరవేగంగా పూర్తవుతున్నది. ఇలా క్రీడా అకాడమీలకు పాలమూరు అడ్డాగా రూపుదిద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తరుణంలో ప్రత్యేక కథనం. 

పాలమూరులో వాలీబాల్‌ అకాడమీ...

2004లో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మహబూబ్‌ నగర్‌లో వాలీబాల్‌ అకాడమీని ఏర్పాటు చేసింది. 2008 వరకు ఈ అకాడమీ శాప్‌ ఆధ్వర్యంలో పనిచేసింది. ఈ కాలంలో అనేకమంది జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యారు. అయితే నిర్వహణ భారం ఎక్కువైందంటూ సమైక్య రాష్ట్రంలో 2008 చివర్లో వాలీబాల్‌ అకాడమీని మూసేశారు. అకాడమీకి కోచ్‌ల కొరత,  నిధుల కేటాయింపు లేకపోవడంతో వాలీబాల్‌ క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పూర్వవైభవం తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. మహబూబ్‌ నగర్‌కే చెందిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని తిరిగి వాలీబాల్‌ అకాడమీని ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టారు. పట్టణంలోని మైదానంలో నూతన వాలీబాల్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది  జిల్లా అధికారులు అకాడమీకి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర క్రీడాశాఖ అధికారులకు ఓ నివేదిక అందజేశారు. త్వరలో వాలీబాల్‌ అకాడమీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

అల్లీపురంలో ఇండోర్‌ స్టేడియం..


మహబూబ్‌ నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురంలో ప్రభుత్వం ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం ఏర్పాటు చేస్తున్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.1.29 కోట్ల నిధులు విడుదల చేసింది. స్టేడియం ఏర్పాటుతో ఉమ్మడి పాలమూరులోని గ్రామీణ క్రీడాకారులను సాన బట్టి అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో స్థానికుడైన సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఎకరంన్నర పొలం ఉచితంగా అందించారు. ప్రస్తుతం ఇక్కడ 80శాతం పనులు పూర్తయ్యాయి. అల్లీపురం ఇందిరమ్మ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌తో పాటు టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌, క్యారమ్స్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌ తదితర 13 క్రీడలకు సైతం శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖేలో ఇండియా ద్వారా త్వరలోనే బ్యాడ్మింటన్‌ శిక్షకులను ఎంపిక చేయనున్నట్లు సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. 

వనపర్తిలో హాకీ అకాడమీ


వనపర్తి అంటే హాకీ, హాకీ అంటే వనపర్తి అన్న తీరుగా స్థానికంగా ఈ క్రీడకు మంచి ఆదరణ ఉంది. వనపర్తి నుంచి ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చారు. అనేక మంది క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఇక్కడి యువతకు క్రికెట్‌ కంటే హాకీ అంటేనే మక్కువ ఎక్కువ. వనపర్తిలో హాకీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అండర్‌-16 స్థాయిలో 24 మంది ప్లేయర్లను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏటా అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయిలో జూనియర్స్‌, సీనియర్స్‌ స్థాయిలో టోర్నీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పాఠశాల స్థాయిలో రాష్ట్ర పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 96 మంది ప్లేయర్లు అకాడమీ నుంచి బరిలోకి దిగారు. అకాడమీ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు జాతీయస్థాయి జూనియర్స్‌ విభాగంలో నాలుగు స్వర్ణ పతకాలు, సీనియర్స్‌లో ఒక స్వర్ణం సాధించారు.


పాలమూరులో క్రీడాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాం. యువ క్రీడాకారుల ప్రతిభకు పెద్దపీట వేస్తూ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్‌లో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  సైనా, సింధు లాంటి షట్లర్లను తయారు చేయాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నాం

-వెంకటేశ్వర్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌

గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో ప్రతిభ కల్గిన ప్లేయర్లు ఉన్నారు. వారికి సరైన శిక్షణనిస్తే మెరికల్లాగా తీర్చిదిద్దవచ్చు. క్రీడలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే పాలమూరులో వాలీబాల్‌ అకాడమీని సకల వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. ఈ అకాడమీ వల్ల జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లను తయారుచేసేందుకు అవకాశముంది.  పాలమూరు అంటే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల అడ్డాగా మారుస్తాం

- శ్రీనివాస్‌గౌడ్‌, క్రీడాశాఖ మంత్రి 

 


logo