శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 02:45:21

రోహిత్‌ రాక్స్‌

రోహిత్‌ రాక్స్‌

  • హిట్‌మ్యాన్‌ భారీ సెంచరీ
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 300/6 
  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడటం లేదనుకుంటున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. తాను జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో చెన్నైలో చూపెట్టాడు. తొలి రోజు నుంచే గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపుతూ.. వన్డే తరహా ఇన్నింగ్స్‌తో భారీ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా ప్రభావం తర్వాత తొలిసారి అభిమానుల కేరింతల మధ్య జరిగిన పోరులో రోహిత్‌కు తోడు రహానే కూడా పట్టుదల కనబర్చడంతో మొదటి రోజు మెరుగైన స్థితిలో నిలిచిన టీమ్‌ఇండియా.. ఆదివారం ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం! 

చెన్నై: తొలి టెస్టు ఓటమి నుంచి బయటపడ్డ టీమ్‌ఇండియా రెండో టెస్టులో అదరగొట్టింది. కొవిడ్‌-19 బ్రేక్‌ తర్వాత తొలిసారి ప్రేక్షకుల సమక్షంలో ఇంగ్లండ్‌పై కోహ్లీసేన ఆధిపత్యం కనబర్చింది. స్పిన్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న చెపాక్‌ పిచ్‌పై స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (231 బంతుల్లో 161; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో కదం తొక్కడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 300 పరుగులు చేసింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (149 బంతుల్లో 67; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌, మొయిన్‌ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0) డకౌటైనా.. రోహిత్‌ రెచ్చిపోయి ఆడాడు. వన్డే తరహా ఆటతో ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చి చెండాడాడు. రిషబ్‌ పంత్‌ (33; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), అక్షర్‌ పటేల్‌ (5) క్రీజులో ఉన్నారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై వీరిద్దరూ ఇంకెన్ని పరుగులు జోడిస్తారో చూడాలి!

అక్షర్‌ అరంగేట్రం

టీమ్‌ఇండియా తరఫున ఏడేండ్ల క్రితమే వన్డే అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌.. శనివారం తొలి టెస్టు ఆడాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు విరాట్‌ అతడికి టెస్టు క్యాప్‌ అందించాడు. 

  1. స్పిన్నర్‌ చేతిలో డకౌటవడం విరాట్‌ కోహ్లీకి ఇదే తొలిసారి. 
  2. కోహ్లీ వరుస ఇన్నింగ్స్‌ల్లో క్లీన్‌ బౌల్డ్‌ అవడం కూడా ఇదే మొదటిసారి. 
  3. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక శతకాలు బాదిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ (40) నిలిచాడు. సచిన్‌ (100), కోహ్లీ (70), ద్రవిడ్‌ (48) ముందున్నారు. 

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)  అలీ (బి) లీచ్‌ 161, గిల్‌ (ఎల్బీ) స్టోన్‌ 0, పుజారా (సి) స్టోక్స్‌ (బీ) లీచ్‌ 21, కోహ్లీ (బి) అలీ 0, రహానే (బి) అలీ 67, పంత్‌ (నాటౌట్‌) 33, అశ్విన్‌ (సి) పోప్‌ (బి) రూట్‌ 13, అక్షర్‌ (నాటౌట్‌) 5, మొత్తం: 300/6. వికెట్ల పతనం: 1-0, 2-85, 3-86, 4-248, 5-249, 6-284, బౌలింగ్‌: బ్రాడ్‌ 11-2-37-0, స్టోన్‌ 15-5-42-1, లీచ్‌ 26-2-78-2, స్టోక్స్‌ 2-0-16-0, మొయిన్‌ అలీ 26-3-112-2, రూట్‌ 8-2-15-1.


VIDEOS

logo