సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 03, 2020 , 02:27:40

రిటర్నింగ్‌ అధికారి నియామకం చెల్లదు

 రిటర్నింగ్‌ అధికారి నియామకం చెల్లదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)గా వ్యవహరిస్తున్న జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ నియామకం చెల్లదని రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అన్నారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో ఆదివారం పలు క్రీడాసంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను క్రీడాహబ్‌గా తయారు చేయాలన్న లక్ష్యంతో టీవోఏ అధ్యక్ష పదవి పోటీలో నిలిచిన ఐటీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించడం అక్రమమని జగన్‌మోహన్‌ రావు విమర్శించారు.  జయేశ్‌ నామినేషన్‌ తిరస్కరణకు కారణాలను అడిగినా ఆర్వో చెప్పడం లేదని, ఈ అంశం సహా ఎన్నికల నిర్వహణపైనా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. గత ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం పోటీలో ఉన్న జగదీశ్వర్‌ యాదవ్‌ వర్గానికి ఎన్నికల సిబ్బంది అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్‌మోహన్‌ రావు ఆరోపించారు. ఈ సమావేశంలో ప్రకాశ్‌ రాజ్‌, ప్రేమ్‌రాజ్‌, పాణిరావు, శ్రీనివాస్‌, సోమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

స్పోర్ట్స్‌ కోడ్‌ అమల్లో ఉంది: సాట్స్‌ చైర్మన్‌

తెలంగాణలోని అన్ని క్రీడాసంఘాలకు స్పోర్స్‌ కోడ్‌ వర్తిస్తుందని, దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రెండు రోజుల క్రితమే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారని సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. స్పోర్ట్స్‌ కోడ్‌ నిబంధనల ప్రకారం టీవోఏ అధ్యక్ష పదవి పోటీలో ఉన్న కే.రంగారావు, ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్న జగదీశ్వర్‌ యాదవ్‌ నామినేషన్లు చెల్లవని ఆయన తెలిపారు.


logo