ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 24, 2020 , 01:16:54

కపిల్‌దేవ్‌కు గుండెపోటు

కపిల్‌దేవ్‌కు గుండెపోటు

  • యాంజియోప్లాస్టీతో కోలుకుంటున్న దిగ్గజ ఆల్‌రౌండర్‌ 
  • త్వరలో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం.. ఆరోగ్యం కుదుటపడాలని ప్రముఖల సందేశాలు 

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ అనారోగ్యానికి గురయ్యారు. గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హార్ట్‌ దవాఖానలో ఆయనను చేర్పించారు. తొలుత ఛాతిలో నొప్పి అని చెప్పిన వైద్యులు ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ 61 ఏండ్ల దిగ్గజ క్రికెటర్‌ ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం హాస్పిటల్‌ వర్గాలు స్పందిస్తూ ‘కపిల్‌కు గుండెపోటు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఆయనకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కపిల్‌ను డాక్టర్‌ అతుల్‌ మాథూర్‌ నేతృత్వంలోని వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది. త్వరలోనే కోలుకునే అవకాశముంది’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో ఇలా జరిగిందన్న వైద్య బృందం.. యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించినట్లు పేర్కొంది. మరోవైపు తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించిన వారికి కపిల్‌ కృతజ్ఞతలు తెలిపారు. కపిల్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘మీరు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తా’అని పేర్కొన్నారు. దేశానికి తొలి ప్రపంచ కప్‌ (1983) అందించిన హర్యానా హరికేన్‌ త్వరగా కోలుకోవాలని క్రీడాలోకం ఆకాంక్షించింది. సచిన్‌  నుంచి కోహ్లీ వరకు సామాజిక మాధ్యమాల్లో ‘గెట్‌ వెల్‌ సూన్‌ పాజీ’అంటూ పోస్ట్‌లు పెట్టారు. మరోవైపు కెప్టెన్‌ త్వరలో కోలుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. భారత్‌ తరఫున 131 టెస్టుల్లో 5248 పరుగులు చేయడంతో పాటు 434 వికెట్లు పడగొట్టిన కపిల్‌దేవ్‌.. వన్డేల్లో 3783 రన్స్‌తో పాటు 253 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.