గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 00:14:37

అథ్లెట్ల క్షేమమే ముఖ్యం

అథ్లెట్ల క్షేమమే ముఖ్యం

న్యూఢిల్లీ: అథ్లెట్ల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో టోక్యో  ఒలింపిక్స్‌ గురించి క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు భారత క్రీడాప్రాధికార సంస్థ, ఐవోసీ, జాతీయ ఫెడరేషన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ‘అన్ని జాతీయ ఒలింపిక్‌ కమిటీలు అథ్లెట్ల సన్నద్ధత, ఆరోగ్యంపై ఐవోసీకి ఈవారంలో తెలియజేయాలి. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అథ్లెట్ల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ఐవోఏ ఆందోళనగా ఉంది. 

ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు’ అని బాత్రా తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని, ఐవోసీ తుది ప్రకటన కోసం వేచిచూస్తామన్నారు. ప్రస్తుతానికి విశ్వక్రీడల బహిష్కరణ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.  

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలా లేదా అనే నిర్ణయాన్ని మరో నెల రోజుల్లో తీసుకోనున్నట్టు భారత ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది. నాలుగైదు వారాల పాటు వేచిచూసి, పరిస్థితిని సమీక్షిస్తామని సోమవారం స్పష్టం చేసింది. వేరే దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగానే ఉందని, అందుకే వేచిచూసేందుకే మొగ్గు చూపుతున్నామని ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా సోమవారం ప్రకటించాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్ల ఆరోగ్యం, సన్నద్ధత అంశాలను ఐవోసీ కోరిందని తెలిపాడు.

బహిష్కరణ దిశగా బ్రిటన్‌..!

బ్రిటన్‌ కూడా కెనడా, ఆస్ట్రేలియా బాట పట్టేలా ఉంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్నా టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయకపోతే క్రీడలను బహిష్కరిస్తామని బ్రిటీష్‌ ఒలింపిక్‌ సంఘం(బీవోఏ) అధ్యక్షుడు హ్యూ రాబర్ట్‌సన్‌ సోమవారం చెప్పాడు. ఈ విషయాన్ని ఐఓసీకి చెప్పినట్టు వెల్లడించాడు. 


logo