e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home స్పోర్ట్స్ అతడే.. నా అండదండ

అతడే.. నా అండదండ

కోహ్లీని ఆకాశానికెత్తిన సిరాజ్‌.. కష్టకాలంలో తోడుగా నిలిచాడు
కెప్టెన్‌కు రుణపడి ఉంటానన్న హైదరాబాదీ

సారథి నమ్మకం సాధిస్తే ఎలాంటి ఫలితాలైనా రాబట్టొచ్చని నిరూపించిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. తన కెప్టెన్‌కు రుణపడి ఉంటానంటున్నాడు. తండ్రి మృతిచెందిన సమయంలో తన వద్దకు వచ్చి కౌగిలించుకొని ఓదార్చిన విరాట్‌.. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని.. నేను నీతో ఉన్నాననే భరోసానిచ్చాడని వెల్లడించాడు. ఆసీస్‌ పర్యటనలో అతడు అందుబాటులో లేకున్నా.. అతడిచ్చిన మనోధైర్యంతో సత్తాచాటగలిగానంటున్న సిరాజ్‌.. తాజా ఐపీఎల్‌లోనూ కోహ్లీ ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిదన్నాడు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో సిరాజ్‌ పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే..

- Advertisement -

న్యూఢిల్లీ: జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇచ్చిన మనోధైర్యం వెలకట్టలేనిది. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై అక్కడికి చేరుకున్న తర్వాత నాన్న చనిపోయిన వార్త అందింది. ఆ సమయంలో నా మనసు కకావికలమైంది. ఉన్నచోటే కుప్పకూలినట్లు అనిపించింది. దీంతో హోటల్‌ గదిలోనే ఏడుస్తూ కూర్చున్నా.. ఆ సమయంలో విరాట్‌ భయ్యా నా గదిలోకి వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని ఓదార్చాడు. నీ కన్నీళ్లు తుడిచేందుకు నేను ఉన్నాననే భరోసానిచ్చాడు. అదే సమయంలో కోచ్‌ రవిశాస్త్రి కూడా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. దీంతో కష్టమైన నిర్ణయమైనా.. నాన్నను చివరిచూపు కూడా చూసుకోకుండా అక్కడే ఉండిపోయాను. టీమ్‌ఇండియా తరఫునే కాక బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా కోహ్లీ చాలా మద్దతుగా ఉంటాడు. అందుకే విరాట్‌ భయ్యా వల్లే నా కెరీర్‌ కొనసాగుతున్నదని చెబుతున్నా.

అతడిచ్చిన భరోసాతోనే..
కెరీర్‌ ఆరంభం నుంచి నాకు అండగా ఉంటూ వస్తున్న కోహ్లీ భయ్యా.. ఎప్పుడూ నాతో ఒకే మాట అంటుంటాడు. ‘నీలో సత్తా ఉంది. నువ్వు ఏ వికెట్‌పై అయినా దుమ్మురేపగలవు. ప్రత్యర్థి ఎవరైనా వికెట్‌ పడగొట్టగల తెలివి నీకుంది’అని అతడిచ్చే భరోసానే ఈ రోజు నన్ను టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించేంతటి వాడిని చేసింది. ఆసీస్‌ పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ అందుబాటులో లేకపోయినా.. ఫోన్‌ ద్వారా టచ్‌లోనే ఉన్నాడు. కష్టకాలంలో జట్టు నాకు మద్దతుగా నిలిస్తే.. నేను దాన్ని వినియోగించుకొని చక్కటి ప్రదర్శన చేయగలిగాను. ప్రస్తుతం (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌ టూర్‌ కోసం రెడీ అవుతున్నా.

మార్పులు మంచికే..

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నైతో మ్యాచ్‌ ముగిసిన కాసేపటికి బాల్కనీలో నిల్చొని ఉన్న విరాట్‌ నా దగ్గరకు వచ్చి ‘మియా తుమ్హారే బౌలింగ్‌ మే జో చేంజెస్‌ ఆయే హై.. వో బహొత్‌ అచ్ఛే హై’ (మియా (జట్టు సభ్యులు సిరాజ్‌ను ముద్దుగా పిలుచుకునే పేరు) నీ బౌలింగ్‌లో వచ్చిన మార్పులు చాలా బాగున్నాయి). అవి మన జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇంగ్లండ్‌ టూర్‌కు సిద్ధంగా ఉండు. ఇలాగే కష్టపడు.. మంచి ఫలితాలొస్తాయి.. ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నాడు. ప్రపంచ అత్యుత్తమ సారథి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు నా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేశాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement