గురువారం 16 జూలై 2020
Sports - Jun 18, 2020 , 01:10:46

పోరాటయోధుడు దాదా

పోరాటయోధుడు దాదా

  • గంగూలీ కెరీర్‌ స్ఫూర్తిదాయకం
  • కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటూ ఉన్నతస్థితికి..

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంతో మంది కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరైతే భవిష్యత్తుపై చింతతో ఏకంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరో అవకాశం రాదేమోనని మరెంతో మంది మానసిక వేదన చెందుతున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ కెరీర్‌ పరిశీలిస్తే మనోధైర్యం వస్తుంది. జీవితంలో రెండో అవకాశం తప్పక వస్తుందనిపిస్తుంది. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మార్చుకోవచ్చనే భరోసా వస్తుంది. తొలి వన్డే తర్వాత మరో అవకాశం కోసం నాలుగేండ్లు  వేచి చూసిన గంగూలీ క్రికెట్‌  కెరీర్‌లోని ముఖ్య ఘట్టాలను పరిశీలిస్తే...  

గంగూలీ కెరీర్‌ 

113 టెస్టులు 7,212 పరుగులు

311 వన్డేలు 11,363 పరుగులు

రెండో అవకాశం కోసం నాలుగేండ్లు.. 

రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన తర్వాత 1992 జనవరి 11న వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌తో గంగూలీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో 3పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు మళ్లీ అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. జాతీయ జట్టుకు మరో అవకాశం కోసం గంగూలీ ఏకంగా నాలుగేండ్లు ఎదురుచూశాడు. మొత్తానికి 1996 మేలో ఇంగ్లండ్‌పై మాంచెస్టర్‌ వేదికగా జరిగిన వన్డేలో గంగూలీ మరోసారి టీమ్‌ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 46పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు గంగూలీ చూసుకోలేదు. జీవితంలో రెండో అవకాశం వస్తుందని చెప్పడానికి దాదా తొలి అడుగే నిదర్శనం. అదే ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు అరంగేట్రంలోనే లార్డ్స్‌లో శతకంతో కదంతొక్కాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ మూడంకెల స్కోరు దాటి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 

సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ.. 

2000లో వెలుగు చూసిన ఫిక్సింగ్‌ ఉదంతం భారత క్రికెట్‌లో అతిపెద్ద సంక్షోభం. కొందరు క్రికెటర్లపై నిషేధం వేటు వడింది. భారత క్రికెట్‌ మళ్లీ పుంజుకుంటుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. అభిమానుల్లోనూ నమ్మకం సన్నగిల్లింది. ప్రపంచ క్రికెట్‌లోనూ భారత్‌ ప్రతిష్ట మసకబారింది. ఆ సమయంలో టీమ్‌ఇండియా సారథ్య పగ్గాలు సౌరవ్‌  గంగూలీ అందుకున్నాడు. జట్టును దూకుడుగా ముందుకు నడిపించాడు. విదేశాల్లోనూ జట్టును విజయాల బాట పట్టించాడు. ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపి ఎదురులేని జట్టుగా తయారు చేశాడు. 2003 ప్రపంచకప్‌  జట్టును ఫైనల్‌ దాకా తీసుకెళ్లాడు. మొత్తంగా గర్వం తలకెక్కిన జట్లు, ప్రత్యర్థులు.. భారత జట్టును గౌరవించే స్థాయికి గంగూలీ  తీసుకెళ్లాడు.    

దాదా చేసిన ఒక్క పొరపాటు 

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్‌ చాపెల్‌ను ఏరి కోరి భారత జట్టు కోచ్‌గా సిఫారసు చేయడం సౌరవ్‌ గంగూలీ తన కెరీర్‌లో చేసిన పెద్ద పొరపాటు. 2005 కోచ్‌గా చాపెల్‌ వచ్చాక టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చీలికలు వచ్చాయి. విభజించు పాలించు అన్న తీరుతో గ్రెగ్‌ వ్యవహరించాడు. ఎన్నో మార్పులు చేశాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి దించేయాలనుకున్నాడు. కొద్ది నెలల్లోనే దాదా నుంచి సారథ్యం చేజారింది. జట్టులోనూ చోటు కోల్పోయాడు. పేకమేడ కూలినట్టుగా అంతా జరిగిపోయింది.     

పునరాగమనంలోనూ గర్జన 

2006లో జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుతో గంగూలీ టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశాడు. భీకర సఫారీల బౌలింగ్‌తో  మన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూకట్టగా దాదా అర్ధశతకం చేసి(51) గంగూలీ 2.0ను మొదలెట్టాడు. ఆ తర్వాతి ఏడాదిలో పాకిస్థాన్‌పై ద్విశతకంతో చెలరేగాడు. 2008లో తన చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై శతకం సాధించి.. ఫామ్‌లో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలాడు.  వన్డేల విషయానికొస్తే రెండేండ్ల తర్వాత 2007లో పునరాగమనం చేసిన గంగూలీ.. ఆ ఏడాది ప్రపంచకప్‌ కూడా ఆడాడు. 

బీసీసీఐ అధ్యక్షుడిగా.. 

క్రికెట్‌కు వీడ్కోలు పలికాక బెంగాల్‌ క్రికెట్‌ సంఘంలో కీలక పదవులు చేపట్టిన గంగూలీ.. గతేడాది బీసీసీఐ అధ్యక్ష పదవిని అధిష్టించాడు. దాదా ఆ స్థానంలోకి రావడంతో ప్రపంచ క్రికెట్‌లో భారత స్వరానికి మరింత గౌరవం, విలువ పెరిగాయి. అందరూ దాదాను పోరాట యోధుడిగా, స్ఫూర్తిప్రదాతగా, ఎవరి ముందు ఏ విషయంలోనూ తలవంచని వ్యక్తిగా పరిగణిస్తున్నారు. గంగూలీ ఐసీసీ అధ్యక్షుడైతే బాగుంటుందని క్రికెట్‌ దక్షిణాఫ్రికా డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ సహా మరికొందరు అన్నారంటేనే.. ఆటకు దూరమై 12ఏండ్లయినా ప్రపంచ క్రికెట్‌లో గంగూలీ గౌరవం, విలువ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. logo