మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 17:21:58

అతనుంటే.. 2019 వరల్డ్‌ కప్‌ గెలిచేవాళ్లం : రైనా

అతనుంటే.. 2019 వరల్డ్‌ కప్‌ గెలిచేవాళ్లం : రైనా

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌కు భారత్ జట్టులో అంబటి రాయుడు ఉంటే.. ఇండియా వరల్డ్‌కప్‌లో విజయం సాధించేదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడు 2018 ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం  టీమిండియాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ సమస్యకు రాయుడు పరిష్కారం చూపాడు. దాదాపు ఏడాదికి పైగా నెం.4లో అతడిని ఆడించిన భారత సెలెక్టర్లు.. వరల్డ్‌కప్ జట్టులోకి మాత్రం ఎంపిక చేయలేదు. రాయుడు స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. 

ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో గత కొన్నేండ్లుగా రాయుడు చెన్నై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరుగనుంది. ఇటీవల చెన్నై క్యాంపేలో అతడి ప్రాక్టీస్‌ను చూసిన రైనా.. అంబటి రాయుడు ఇప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కితాబిచ్చాడు. వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనే అంబటి రాయుడు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ.. కొన్ని రోజుల తరువాత మళ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

‘‘టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో రాయుడు అప్పట్లో నిలకడగా రాణించాడు. ఒకవేళ వరల్డ్‌కప్‌ జట్టులో అతను ఉంటే ..మనం ఆ ప్రపంచకప్‌ని గెలిచేవాళ్లం. ఆ నెం.4 స్థానం కోసం రాయుడు సంవత్సరంన్నర పాటు హార్డ్‌వర్క్ చేశాడు. వరల్డ్‌కప్‌లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబర్చేవాడు. రాయుడికి అవకాశం దక్కలేదు’’ అని రైనా వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడిన భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్ అంచనాల్ని అందుకోలేక గాయంతో టోర్నీ మధ్యలోనే ఇంటిబాట పట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo