నిజమైన స్నేహితుడు అంటే ఇతనే ! కరోనాతో మిత్రుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి.. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినట్లైంది. అంతే ఆక్సిజన్ తీసుకుని రాష్ట్రాలు దాటుతూ.. ఎల్లలు దాటుతూ ఆగమేఘాలపై అతని దగ్గర వాలిపోయాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణవాయువును అందించాడు. ప్రాణ స్నేహితుడి ప్రాణాలను నిలిపాడు. వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్‌లోని బొకోరాకు చెందిన దేవేంద్ర సాధారణ స్కూల్ టీచర్. అతని స్నేహితుడు రంజన్ అగర్వాల్ ఢిల్లీలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల రంజన్ కుటుంబం కరోనా బారిన పడింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రంజన్ అగర్వాల్ పరిస్థితి విషమించి శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికే ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఎంత ప్రయత్నించినా.. ఎవరిని సంప్రదించినా.. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కూడా దొరకలేదు. ఆక్సిజన్ దొరక్క తన స్నేహితుడు విలవిలలాడిపోతున్నాడని జార్ఖండ్‌లో ఉంటున్న తన స్నేహితుడికి తెలిసింది. తన మిత్రుడి పరిస్థితిని తలచుకుని చలించిపోయిన అతను.. ఎలాగైనా తనను కాపాడుకోవాలని అనుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో స్టీల్ ప్లాంట్ ఉండటంతో ఎలాగోలా ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను దొరకబట్టాడు. ఆ సిలిండర్‌ను తీసుకుని ఈ కరోనా కాలంలో ఢిల్లీ బయల్దేరాడు. ఆదివారం మధ్యాహ్నం తన కారులో బొకారో నుంచి బయల్దేరాడు దేవేంద్ర. మూడు రాష్ట్రాలు దాటుకుంటూ 1440 కిలోమీటర్లు ప్రయాణించి సోమవారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రికి చేరుకున్నాడు. సకాలంలో ఆక్సిజన్ అందించి తన మిత్రుడు రంజన్‌ను కాపాడుకున్నాడు.
దేవేంద్ర కారులో ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లడం అంత సులువుగా ఏమీ అయిపోలేదు. అసలే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉంది. ఇదే అదనుగా చాలామంది బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్‌ను అమ్ముతున్నారు. అలాంటి వారిపై పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దేవేంద్ర కారులో ఆక్సిజన్ సిలిండర్ తరలించడం కోసం బాగానే కష్టపడ్డాడు. బిహార్, యూపీలో పోలీసులు ఆపినప్పుడు.. ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాళ్లందరికీ తన స్నేహితుడి పరిస్థితిని వివరించి చెప్పడంతో చివరకు దేవేంద్రను వదిలేశారు. అలా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ చివరకు నోయిడా చేరుకుని తన స్నేహితుడిని రక్షించుకున్నాడు. రంజన్ ఆస్పత్రి నుంచి ఢిశ్చార్జి అయ్యాకే జార్ఖండ్ వెళ్తానని.. అప్పటివరకు స్నేహితుడికి అండగా ఉంటానని దేవేంద్ర చెబుతున్నాడు. స్నేహితుడి కోసం దేవేంద్ర చేసిన రిస్క్‌ను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
COVAXIN పనితీరుపై అమెరికా కీలక వ్యాఖ్యలు
corona diet | కరోనాను ఎదుర్కోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలేవి ?
విశాఖలో విషాదం.. ప్రాణ వాయువు అందక ఆగిన చిన్నారి ఊపిరి
అధిక ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
చేతులెత్తేసిన డాక్టర్లు..బతికి చూపించిన రోగి