గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 13:47:02

రోహిత్.. సెహ్వాగ్​లా ప్రభావం చూపగలడు

రోహిత్.. సెహ్వాగ్​లా ప్రభావం చూపగలడు

న్యూఢిల్లీ: టెస్టుల్లో మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​లా.. ప్రస్తుతం రోహిత్ శర్మ అదరగొట్టగలడని టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వీరూ చూపిన ప్రభావాన్నే రోహిత్ చూపగలడని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ఓపెనర్​గా గతేడాదే అవతారమెత్తిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్​ల్లో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్​గా తొలి మ్యాచ్​లోనే రెండు శతకాలు బాదిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. గతంలో టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ అనేకసార్లు దూకుడుగా ఆడి భారత జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అలాంటి పాత్రే పోషించగలడని ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.

“వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన అతడి(రోహిత్ శర్మ) నుంచి మనం టెస్టుల్లోనూ ద్విశతకాన్ని చూడాలి. అతడు భవిష్యత్తులో ఇంకా చాలా మ్యాచ్​లు ఆడతాడు. అతడు మంచి ఫి​ట్​నెస్​తో కొనసాగితే.. వీరేంద్ర సెహ్వాగ్​లా ప్రభావం చూపగలడు. అతడు టెస్టుల్లో ఓపెనర్​గా ఆడడం ఇటీవలే ప్రారంభించాడు. ఓపెనర్​గా టెస్టు క్రికెట్​లో అతడు విభిన్నంగా కనిపిస్తున్నాడు. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్​మన్​గా ఉన్నంత కాలం రోహిత్​ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే రోహిత్ సుదీర్ఘంగా ఆడే విషయంపైనే అన్ని ఆధారపడి ఉంటాయి. సెహ్వాగ్ 100 టెస్టులు ఆడాడు. అయితే వన్డేల్లో మాత్రం రోహిత్ ఓ చాంపియన్​. నా టాప్​-3 బ్యాట్స్​మెన్​లో రోహిత్ కచ్చితంగా ఉంటాడు”అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.  టెస్టుల్లో 2013లోనే అరంగేట్రం చేసిన రోహి​త్​.. మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేస్తూ రాణించలేకపోయాడు. గతేడాది ఓపెనర్​గా మారి సుదీర్ఘ ఫార్మాట్​లోనూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

 


logo