శనివారం 23 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 10:27:22

హైద‌రాబాద్ క్రికెట్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా

హైద‌రాబాద్ క్రికెట్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా

హైద‌రాబాద్‌: క‌్రికెట్ త‌క్కువ‌.. లొల్లి ఎక్కువ‌.. సింపుల్‌గా చెప్పాలంటే హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో జ‌రిగేది ఇదే. ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిల‌వ‌డం హెచ్‌సీఏకే చెల్లింది. తాజాగా అలాంటిదే మరో రెండు వివాదాల‌తో త‌న ప‌రువు తానే తీసుకుంది. ఇందులో ఒక‌టి చీఫ్ కోచ్‌ను తొల‌గించ‌డం కాగా.. మ‌రొక‌టి స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీకి టీమ్ ఎంపిక‌. 

అజారుద్దీన్‌కే తెలియ‌కుండా..

తొలి వివాదం ఎంత విచిత్ర‌మైన‌దంటే.. అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అయిన అజారుద్దీన్‌కే తెలియ‌కుండా చీఫ్ కోచ్ అనిరుధ్ సింగ్‌ను తొలగించారు సెక్ర‌ట‌రీ ఆర్ విజ‌యానంద్‌. శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అజ‌ర్‌తోపాటు ప‌లువురు అపెక్స్ క‌మిటీ స‌భ్యుల‌కు చీఫ్ కోచ్‌ను తొల‌గించిన విష‌య‌మే తెలియ‌దు. అయితే ఇది తెలిసిన వెంట‌నే శ‌నివారం అర్ధ‌రాత్రి అనిరుధ్‌కు ఫోన్ చేసిన అజ‌ర్‌.. వెంట‌నే గ్రీన్ పార్క్ హోట‌ల్‌లో బ‌యో బ‌బుల్‌లో ఉన్న టీమ్‌తో చేరాల్సిందిగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే అత‌న్ని మ‌ళ్లీ చీఫ్ కోచ్‌గా చేశారా లేదా అనేదానిపై హెచ్‌సీఏ నుంచి అధికారిక స‌మాచారం ఏదీ లేదు. నిజానికి ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి టీమ్‌ను చూసుకోవాల్సిందిగా అనిరుధ్‌కు సూచించిన అపెక్స్ కౌన్సిల్.. అత‌న్ని ట్ర‌య‌ల్ మ్యాచ్‌ల‌లో సెల‌క్ష‌న్ ప్ర‌క్రియ‌లో భాగం చేసింది. అయితే శ‌నివారం రాత్రికి రాత్రి అనిరుధ్‌ను తొల‌గించి జాకిర్ హుస్సేన్‌ను చీఫ్ కోచ్‌గా చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

టీమ్ ఎంపిక‌లోనూ అదే లొల్లి

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం జ‌రిగిన టీమ్ ఎంపిక కూడా వివాదాస్ప‌ద‌మైంది. శివాజీ యాద‌వ్‌, అహ్మ‌ద్ ఖాద్రీ, అభిన‌వ్ కుమార్ నేతృత్వంలోని తాత్కాలిక సెల‌క్ష‌న్ క‌మిటీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టాప్ ఫామ్‌లో ఉన్న మెహ‌దీ హ‌స‌న్‌లాంటి ప్లేయ‌ర్‌ను ప‌క్క‌న పెట్టి అస‌లు ప్రాబ‌బుల్స్ జాబితాలోనూ లేని హితేష్ యాద‌వ్‌ను తీసుకోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. టీ20ల్లో హైద‌రాబాద్ త‌ర‌ఫున హ‌స‌న్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు ట్ర‌య‌ల్ మ్యాచ్‌ల‌లో అజారుద్దీన్ ఎలెవ‌న్ త‌ర‌ఫున ఆడిన హ‌స‌న్‌.. మొత్తం 7 వికెట్లు తీశాడు. అయినా అత‌న్ని టీమ్‌లో నుంచి తొల‌గించ‌డం వివాదానికి దారి తీసింది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా గ్రూప్ బీలో ఉన్న‌ హైద‌రాబాద్ త‌న లీగ్ మ్యాచ్‌ల‌ను కోల్‌క‌తాలో ఆడ‌నుంది. ప్ర‌స్తుతం టోర్నీ కోసం బ‌యో బ‌బుల్‌లో ఉన్న హైద‌రాబాద్ టీమ్ స‌భ్యులు.. గ్రీన్ పార్క్ హోట‌ల్లో ఐదు రోజుల పాటు గ‌డ‌ప‌నున్నారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

900 బిలియ‌న్ డాలర్ల‌ బిల్లుపై ట్రంప్ సంత‌కం..

స్మార్ట్‌ఫోన్‌తోనే ఏడు గంటలు

పెళ్ళి ఫొటోల‌లో నిహారిక‌కు న‌చ్చిన ఫొటో ఏదో తెలుసా?


logo