మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 01, 2020 , 01:22:50

హర్మన్‌ప్రీత్‌ విజృంభణ

 హర్మన్‌ప్రీత్‌ విజృంభణ
  • ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

కాన్‌బెరా: టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(42) చివర్లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో శుక్రవారం ఇక్కడ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారత బౌలర్లు రాజేశ్వరీ గైక్వాడ్‌(2/19), దీప్తి శర్మ(2/30), శిఖ పాండే(2/33) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 147పరుగులే చేసింది. ఇంగ్లిష్‌ జట్టు కెప్టెన్‌ హెథెర్‌ నైట్‌(67) ఒంటరిపోరు చేసింది. ఆ తర్వాత టీమ్‌ఇండియా లక్ష్యఛేదనలో యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ(30) రాణించగా  స్మృతి మంధాన(15),  రోడ్రిగ్స్‌(26) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఆ తర్వాత వేద కృష్ణమూర్తి(7), భాటియా(11) విఫలం కాగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ బౌండరీలతో ఎదురుదాడికి దిగి ఒంటరి పోరాటం చేసింది.  క్రమంగా లక్ష్యం కరుగుతూ రాగా, విజయం కోసం చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తొలి రెండు బంతులకు సింగిల్స్‌ రాగా, మూడో బాల్‌కు హర్మన్‌ప్రీత్‌ సిక్స్‌ బాది జట్టును గెలిపించింది. తదుపరి మ్యాచ్‌లో భారత్‌.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఆదివారం తలపడనుంది. 


logo
>>>>>>