మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 13, 2020 , 01:48:49

మార్పుల్లేకుండానే..

మార్పుల్లేకుండానే..
  • మహిళల టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎంపిక.. ఫిబ్రవరి 21 నుంచి మెగాటోర్నీ

ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవల చాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన బెంగాల్‌ ప్లేయర్‌ రిచా ఘోష్‌ ఎంపిక మినహా.. సంచలన నిర్ణయాలు లేకుండానే ఎంపిక ప్రక్రియ ముగిసింది. మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ హెమలత కాలా నేతృత్వంలోని కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనుండగా.. తెలంగాణ నుంచి పేసర్‌ అరుంధతి రెడ్డి చోటు నిలబెట్టుకుంది. వచ్చే నెల 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా.. అంతకుముందే భారత జట్టు ఆసీస్‌లో ముక్కోణపు టోర్నీ ఆడనుంది. విశ్వసమరానికి ముందు జరిగే మూడు దేశాల టోర్నీ కోసం కూడా ఆదివారమే జట్టును ప్రకటించగా.. ఇందులో నుజాహత్‌ పర్వీన్‌కు మాత్రమే అదనంగా చోటు దక్కింది. ఇటీవలి కాలంలో జట్టులోకి వచ్చిన ప్లేయర్లు చక్కటి ప్రదర్శన చేస్తుండటంతో మెగాటోర్నీలో సత్తాచాటుతామని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. ‘విశ్వ సమరానికి ముందు ముక్కోణపు టోర్నీ ఆడనుండటం మాకు కలిసిరానుంది. తుది జట్టు ఎంపిక విషయంలో ఈ టోర్నీ సహకరిస్తుంది. జూనియర్లు, సీనియర్లతో మా జట్టు సమతూకంగా ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని భావిస్తున్నా. మా ప్రధాన బలం స్పిన్నే.. దానిపైనే మరింత దృష్టి పెడుతున్నాం. డబ్ల్యూవీ రామన్‌ శిక్షణలో ఇంకా మెరుగయ్యాం. ఒత్తిడిని జయించే విషయంలో ఆయన సూచనలు అమూల్యం. అది మాకు మెగాటోర్నీలో ఉపకరిస్తుందనుకుంటున్నా’అని హర్మన్‌ప్రీత్‌ వివరించింది.
జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్‌, తానియా భాటియా, పూనమ్‌ యాదవ్‌, రాధ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖ పాండే, పూజ వస్ర్తాకర్‌, అరుంధతి రెడ్డి.


భారత జట్టులో చోటు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం ప్రపంచకప్‌ గెలువాలన్నదే మా లక్ష్యం. సవాలును ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నా. ఇటీవల సీనియర్‌ జట్టులో ఆడేటప్పుడు ఎన్నో విషయాలను నేర్చుకున్నా. బౌలింగ్‌లో వైవిధ్యాలను  పెంచుకున్నా. టీ20ల్లో విజయవంతమయ్యేందుకు వేరియేషన్లు ఎంతో ముఖ్యం. టోర్నీ ముందు మేం చేసిన సన్నాహాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి.
 - అరుంధతి


logo
>>>>>>