సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:52:42

కప్పు కొడితే చరిత్రే..

కప్పు కొడితే చరిత్రే..
  • మహిళల టీ20 ప్రపంచకప్‌పై హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్య
  • భారత్‌ గట్టి పోటీదారు అని వెల్లడి

సిడ్నీ: సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి స్థానాలను భర్తీచేయడం కష్టమే అయినా.. అందుబాటులో ఉన్న వనరులతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న విశ్వసమరంలో భారత జట్టు తొలి మ్యాచ్‌లో శుక్రవారం ఆతిథ్య ఆసీస్‌తో తలపడనుంది. హైదరాబాదీ స్టార్‌ మిథాలీ గతేడాది పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. వెటరన్‌ పేసర్‌ జులన్‌ చాన్నాళ్లుగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం భారత మహిళల జట్టు సగటు వయసు 22.8 ఏండ్లుగా ఉంది. మెగాటోర్నీలో పాల్గొంటున్న జట్ల కెప్టెన్‌లతో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న హర్మన్‌.. ప్రపంచకప్‌ కోసం తమ జట్టు సన్నద్ధమైన తీరు గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..


మూడేండ్లలో ఎంతో మార్పు

2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి పాలవడం బాధించినా.. ఆ తర్వాత నుంచి లభిస్తున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు హర్మన్‌ పేర్కొంది. మూడేండ్ల క్రితం జరిగిన ఆ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో మిథాలీ సేన 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఓటమి కాస్త బాధించినా.. ఈ మూడేండ్లలో జట్టు ఎంతో మెరుగైందని ఈ బిగ్‌హిట్టర్‌ పేర్కొంది. ప్రస్తుతం జట్టులో దూకుడుగా ఆడే ప్లేయర్లకు కొదవలేదని.. మెగాటోర్నీలో ఇది తమకు ఎంతగానో ఉపయోగపడనుందని హర్మన్‌ చెప్పింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన భారత తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కిన హర్మన్‌.. ఒత్తిడిలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగితే జట్టుకు తిరుగుండదని తెలిపింది. కప్పు వేటలో టీమ్‌ఇండియా గట్టి పోటీదారని అన్న హర్మన్‌.. జట్టులో ప్రతి ఒక్కరూ తమ చిరకాల కల నెరవేర్చుకోవాలనే  పట్టుదలతో ఉన్నారని వివరించింది. ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో శుక్రవారం భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.


అనుభవజ్ఞులు లేకున్నా..

మా సీనియర్‌ ప్లేయర్ల సేవలు అందుబాటులో లేకపోవడం పెద్దలోటే కానీ, యువ క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతున్నారు. ఇటీవలి కాలంలో వాళ్లు చక్కటి ఆటతీరు కనబరుస్తున్నారు. మెగాటోర్నీలోనూ అదే జోరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. రెండేండ్ల క్రితం జట్టులో అందరి కంటే చిన్నాదాన్నైన నేనే.. ఇప్పుడు అత్యంత అనుభవజ్ఞురాలిని. అయితే జట్టు సభ్యులంతా బాధ్యతలు భుజానెత్తుకునేందుకు సిద్ధంగా ఉండటం శుభపరిణామం. జట్టు సరైన కూర్పుతో ముందుకు సాగుతున్నది. ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన పని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.


ఆ ఆదరణ అద్భుతం..

మా జట్టు రోజురోజుకూ మెరుగవుతున్నది. అందరూ సానుకూలంగా కనిపిస్తున్నారు. మేం ట్రోఫీ గెలిస్తే పేరు ప్రఖ్యాతలతో పాటు మహిళల క్రికెట్‌లో గుణాత్మకమైన మార్పు వస్తుందని అనుకుంటున్నాం. ఈ విషయం అందరికీ తెలుసు. 2017లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినా.. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యమేసింది. ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం ముఖ్యమని మా తల్లిదండ్రులు చెప్పారు. మేం గెలిస్తే చరిత్ర తిరుగరాసినవాళ్లమవుతాం. అందుకోసం మా శాయశక్తులు కృషిచేస్తాం. గత రెండేండ్లలో మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా మేం కొన్ని మ్యాచ్‌లు ఆడాం. దాన్నే ఇక ముందు కూడా కొనసాగిస్తాం. ప్రపంచకప్‌ నెగ్గడం ప్రతి ఒక్కరి కల. అది సాధ్యమైతే దేశంలో అమ్మాయిల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తే మాకు లబ్ధి చేకూరుతుంది.


logo