ఆస్తులు కాదు ఆరోగ్యం ఇవ్వాలి

గజ్వేల్, జనవరి 28: ‘సీఎం కేసీఆర్ కప్'ఫుట్‌బాల్ టోర్నీని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు గజ్వేల్ వేదికగా నిలువడం హర్షనీయమని అన్నారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి హరీశ్‌రావు.. అనంతరం కాసేపు ఫుట్‌బాల్ ఆడి అలరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘పిల్లలకు ఆస్తులకన్నా ఆరోగ్యం అందించడం ముఖ్యం. చదువుతో పాటు క్రీడలకు సమయం కేటాయించాలి. ఆటలు ఆడితే ఏ వ్యక్తికి దవాఖాన అవసరం ఉండదు. ఫిజికల్ ఫిట్నెస్ లేకే షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఫుట్‌బాల్ లాంటి శారీరక శ్రమతో కూడిన ఆటలతో ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుంది’అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.