శనివారం 29 ఫిబ్రవరి 2020
భారత్‌ను సందర్శించాలనేది నా కూతురు కోరిక: రాస్‌ టేలర్‌

భారత్‌ను సందర్శించాలనేది నా కూతురు కోరిక: రాస్‌ టేలర్‌

Feb 14, 2020 , 17:40:57
PRINT
భారత్‌ను సందర్శించాలనేది నా కూతురు కోరిక:  రాస్‌ టేలర్‌

టేలర్‌ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100టీ20లు ఆడగా..ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

హామిల్టన్‌: అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు న్యూజిలాండ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌(35) ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు సాధించిన విజయాలపై సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నాడు. చిరస్మరణీయ మ్యాచ్‌ ఆడబోతున్న నేపథ్యంలో టేలర్‌ పలు ఆసక్తికర విషయాలు విలేకరులతో పంచుకున్నాడు. త‌ప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపు మీదేనని వ్యాఖ్యానించాడు.  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్‌ వేదికగా తలపడనున్నాయి.  టేలర్‌ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100టీ20లు ఆడగా..ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఎన్ని పరుగులు చేసినా..

'ఏ ఒక్కరి కెరీర్‌ కూడా అద్భుతంగా సాగదు. ప్రత్యేకించి బ్యాట్స్‌మన్‌గా ఏదో ఒక దశలో ఫెయిల్‌ అవుతాం. తప్పిదాలే  మనల్ని ఒక వ్యక్తిగా ఎదగడానికి కారణమవుతాయి.  నా కెరీర్‌లో ఇప్పటి వరకు సాధించిన ఘనతలపై సంతృప్తికరంగా ఉన్నా. ఏం చేయాలనుకుంటున్నానో నేను అదే చేస్తున్నాని భావిస్తున్నా.  వెల్లింగ్టన్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నా కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో స్పెషల్‌. నా భార్య మా ముగ్గురి పిల్లలను పెంచి పెద్ద చేసింది. వాళ్ల తండ్రి ఏం చేస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. క్రికెట్లో   రాణించడంలో వారి సాయం కూడా ఉంది.   మీరు ఎన్ని పరుగులు చేసినా చివరికి మీ కుటుంబమే మీతో ఉంటుంది. నా కంటే ఎక్కువ మా కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ప్రపంచంలోని కొన్ని గొప్ప ప్రదేశాల్లో విహారయాత్రకు వెళ్లాలని నా పిల్లలు అనుకుంటారు. భారత్‌ను సందర్శించాలనేది నా కూతురు కోరిక.' అని  కివీస్‌ స్టార్‌ ప్లేయర్‌ వివరించాడు. 

నా పనైపోయిందనుకున్నా..

'సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌ అనంతరం ఇక నేను సుదీర్ఘ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడలేమోనని అనుకున్నా. అదృష్టం కలిసొచ్చింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో శతకం సాధించడంతో టెస్టు ఫార్మాట్‌పై మళ్లీ ఆసక్తికలిగింది. మాంచెస్టర్‌లో చేసిన  శతకాలే అత్యుత్తమమైనవి. ఆ మ్యాచ్‌లో నేను 158 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాం. ఆ తర్వాత కొలంబోలో శ్రీలంకతో సిరీస్‌లో చేసిన   140, 170 ఎంతో ప్రత్యేకమైనవి. ఆస్ట్రేలియాతో పోరులో 290 పరుగుల అద్వితీయ ఇన్నింగ్స్‌ మరచిపోలేనిది. ఐతే ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసిందని. న్యూజిలాండ్‌ తరఫున ఆడాలని ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటానని'  టేలర్‌ చెప్పుకొచ్చాడు. 


logo