బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 00:57:23

తరానికొక్కడు

తరానికొక్కడు

  • ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ 

న్యూఢిల్లీ:  టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌  ధోనీ మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడికి మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ లాంటి ఆటగాడు తరానికి ఒకసారి మాత్రమే వస్తాడని మాజీ ఓపెనర్‌  సెహ్వాగ్‌ ప్రశంసించగా.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ , ప్రస్తుత భారత కెప్టెన్‌  కోహ్లీ, రోహిత్‌ శర్మ,  రైనా, యువరాజ్‌తో పాటు పలువురు ప్లేయర్లు మహీకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెప్పారు. ‘ధోనీ భాయ్‌ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ధోనీ తనకెప్పుడూ కెప్టెనే అని కోహ్లీ అన్న మాటలు సహా పలువురు విదేశీ క్రికెటర్లు తమ అభిమాన క్రికెటర్‌ మహీ అన్న వీడియోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. అలాగే ధోనీ కూతురు జివా.. ప్రత్యేకంగా జ్ఞాపకాలతో కూడిన వీడియోతో విష్‌ చేసింది.

 బ్రావో స్పెషల్‌ గిఫ్ట్‌ 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీకి ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. మహీ ఘనతలను కీర్తిస్తూ.. తాను రూపొందించిన హెలికాప్టర్‌ సాంగ్‌ను విడుదల చేశాడు. 

మహీ ఎప్పుడూ టాపార్డర్‌లోనే ఆడాలనుకున్నా: దాదా 

మహీ ఎప్పుడూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందే ఆడితే చూడాలనుకున్నానని  బీసీసీఐ చీఫ్‌ గంగూలీ చెప్పాడు. ‘ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ధోనీ ఒకడు. ఫినిషర్‌గానే కాదు.   టాపార్డర్‌లో  ఆడాలని అనుకున్నా’ అని దాదా చెప్పాడు. 

త్వరలో ‘ధోనీ’ పర్యావరణహిత ఎరువులు   

కరోనా ప్రభావం తగ్గి సాధారణ జీవనం నెలకొనే వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోకూడదని మాజీ కెప్టెన్‌ ధోనీ నిర్ణయించుకున్నాడని అతడి చిన్ననాటి స్నేహితుడు, మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ స్పష్టం చేశాడు. ప్రస్తుతం రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో ధోనీ.. సేంద్రియ వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నాడని తెలిపాడు. త్వరలోనే పర్యావరణహిత ఎరువులను సొంత బ్రాండ్‌పై తీసుకొచ్చేందుకు ధోనీ ప్రయత్నిస్తున్నాడని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో దివాకర్‌  వెల్లడించాడు. 

తాజావార్తలు


logo