బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 16:47:01

బీజేపీ ఎంపీకి దిమ్మ‌దిరిగే రిప్లై ఇచ్చిన హ‌నుమ విహారి

బీజేపీ ఎంపీకి దిమ్మ‌దిరిగే రిప్లై ఇచ్చిన హ‌నుమ విహారి

బ్రిస్బేన్‌:  సిడ్నీటెస్ట్ హీరో, టీమిండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్ హ‌నుమ విహారి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఈసారి ఆట‌తో కాకుండా బీజేపీ ఎంపీకి తాను వేసిన ట్వీట్ పంచ్‌తో ట్రెండ్ అవుతున్నాడు. సిడ్నీలో గాయంతోనూ అత‌ను ప్ర‌ద‌ర్శించిన తెగువ‌కు క్రికెట్ ప్ర‌పంచ‌మంతా స‌లాం కొడుతుంటే.. క్రికెట్ గురించి ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని చెప్పుకుంటూనే బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో.. విహారి ఇన్నింగ్స్‌ను విమ‌ర్శించారు. 109 బంతుల్లో కేవ‌లం 7 ప‌రుగులు చేస్తాడా.. అత‌ని వ‌ల్లే టీమిండియా చారిత్ర‌క విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం నేర‌మే అవుతుందంటూ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. అయితే అందులో హ‌నుమ విహారి పేరును త‌న‌కు అల‌వాటైన నార్త్ ఇండియ‌న్ స్టైల్లో హ‌నుమ బిహారి అని రాశారు.

దీనికి విహారి ఇచ్చిన రిప్లై నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా సింపుల్‌గా త‌న పేరు త‌ప్పు రాశార‌ని చెప్పేలా హ‌నుమ విహారి అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకి నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. ట్వీట్ ఆఫ్ ద డెకేడ్ అని ఒక‌రు.. ఎపిక్ అని మ‌రొక‌రు.. మంచి ఆన్స‌ర్ ఇచ్చావ‌ని ఇంకొక‌రు విహారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. విహారి చేసిన ట్వీట్‌కు అర‌గంట‌లోనే 8 వేలకుపైగా రీట్వీట్లు, 26 వేల‌కుపైగా లైక్స్ రావ‌డం విశేషం. 


logo