శనివారం 30 మే 2020
Sports - Feb 15, 2020 , 00:37:58

హనుమ విహారి సూపర్‌ సెంచరీ

హనుమ విహారి సూపర్‌ సెంచరీ
  • చెలరేగిన పుజారా భారత్‌ 263 ఆలౌట్‌
  • న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

హామిల్టన్‌: టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. వన్డే ఫార్మాట్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమ్‌ఇండియా.. టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల టూర్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 78.5 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. తెలుగు ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టగా.. చతేశ్వర్‌ పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కివీస్‌ బౌలర్లు కుగ్‌లిన్‌ (3/40), సోధి (3/72) ధాటికి ఎనిమిది మంది భారత బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.


ముగ్గురు ఓపెనర్లు విఫలం

గాయం కారణంగా రోహిత్‌ శర్మ కివీస్‌ పర్యటనకు దూరం కావడంతో.. టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్‌ స్థానాల కోసం పోటీపడుతున్న ముగ్గురు యువ ఆటగాళ్లు పృథ్వీ షా (0), మయాంక్‌ అగర్వాల్‌ (1), శుభ్‌మన్‌ గిల్‌ (0)ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో.. మనవాళ్లకు చక్కటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందనుకుంటే సీన్‌ రివర్స్‌ అయింది. ఇన్నింగ్స్‌ ఆరంభించడానికి వచ్చిన పృథ్వీ తొలి ఓవర్‌లోనే ఔట్‌ కాగా.. మయాంక్‌, గిల్‌ ఏడో ఓవర్‌లో వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. పృథ్వీ, గిల్‌ బౌన్స్‌కు బొక్కబోర్లా పడితే.. స్వింగ్‌ బంతులు ఆడేందుకు తడబడ్డ మయాంక్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 5 పరుగులకే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయింది. టీమ్‌ఇండియా టెస్టు వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానే (18) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఫలితంగా భారత్‌ 38/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. 


భారీ భాగస్వామ్యం

మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. వన్‌డౌన్‌లో వచ్చిన చతేశ్వర్‌ పుజారా క్రీజులో పాతుకుపోయాడు. కివీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి హనుమ విహారి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. న్యూజిలాండ్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ డారిల్‌ మిషెల్‌ ఎంత మంది బౌలర్లను మార్చినా ఈ జోడీని విడదీయలేకపోయారు. ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించాక పుజారా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌కాగా.. మరికాసేపటికే శతకం పూర్తి చేసుకున్న విహారి ఇన్నింగ్స్‌ చాలించాడు. 


చివర్లో టపాటపా..

పుజారా-విహారి భాగస్వామ్యంతో కుదురుకున్నట్లు కనిపించిన భారత్‌ 30 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ పర్యటనలో ఒక్క మ్యాచ్‌లో కూడా తుదిజట్టులో చోటు దక్కని రిషభ్‌ పంత్‌ (7) ఆకట్టుకోలేకపోయాడు. సోధి వేసిన బంతిని గాల్లోకి లేపి మూల్యం చెల్లించుకున్నాడు. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (0), అశ్విన్‌ (0) డకౌట్‌ కాగా.. ఉమేశ్‌ యాదవ్‌ (9), జడేజా (8) కొన్ని పరుగులు చేశారు.


ఓపెనింగ్‌కైనా రెడీ: విహారి

కీలక సిరీస్‌కు ముందు ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీపడుతున్న ముగ్గురు ఆటగాళ్లు విఫలమైన చోట చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారి.. ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలో బరిలో దిగేందుకైనా సిద్ధమే. ఓపెనింగ్‌ చేయాల్సిందిగా నన్నెవరూ కోరలేదు. ఒకవేళ జట్టు ప్రయోజనాల కోసం ఇన్నింగ్స్‌ ఆరంభించాల్సి వస్తే సంతోషంగా స్వీకరిస్తా. టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్టులు ఆడే సమయంలో ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు కట్టుబడి ఉంటుందని తెలుసు. అందుకే గత రెండు సిరీస్‌ల్లో నాకు చోటు దక్కలేదు. జట్టు కూర్పును అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లే ఎంపిక ప్రక్రియ సాగుతుంది. నేనేంటో ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్‌ పేస్‌ దళం బలంగా ఉంది. అనుభవం ఉన్న ఇలాంటి పేసర్లను ఎదుర్కోవాలంటే సం యమనం అవసరం’అని విహారి పేర్కొన్నాడు. 


స్కోరు బోర్డు

భారత్‌: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్‌లిన్‌ 0, మయాంక్‌ (సి) క్లీవర్‌ (బి) కుగ్‌లిన్‌ 1, పుజారా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 93, గిల్‌ (సి) సీఫెర్ట్‌ (బి) కుగ్‌లిన్‌ 0, రహానే (సి) బ్రూస్‌ (బి) నీషమ్‌ 18, విహారి (రిటైర్డ్‌ ఔట్‌) 101, పంత్‌ (సి) కుగ్‌లిన్‌ (బి) సోధి 7, సాహా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 0, అశ్విన్‌ (ఎల్బీ) సోధి 0, ఉమేశ్‌ (నాటౌట్‌) 9, జడేజా (సి) అలెన్‌ (బి) సోధి 8, ఎక్స్‌ట్రాలు: 26, మొత్తం: 78.5 ఓవర్లలో 263 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-5, 3-5, 4-38, 5-233, 6-245, 7-246, 8-246, 9-250, 10-263, బౌలింగ్‌: కుగ్‌లిన్‌ 14-2-40-3, టిక్నర్‌ 15-3-37-0, డారిల్‌ 7-1-15-0, నీషమ్‌ 13-3-29-1, గిబ్సన్‌ 10-1-26-2, సోధి 14.5-0-72-3, రవీంద్ర 5-1-30-0. 


logo