బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 16, 2020 , 02:15:01

హామిల్టన్‌ మరో చరిత్ర

 హామిల్టన్‌ మరో చరిత్ర

  • ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ కైవసం 
  • షూమాకర్‌ రికార్డు సమం 

ఇస్తాంబుల్‌: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో చరిత్ర సృష్టించాడు. ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఏడోసారి కైవసం చేసుకొని అత్యంత విజయవంతమైన రేసర్‌గా అవతరించాడు. దిగ్గజ మైకేల్‌ షూమాకర్‌ అత్యధిక రేస్‌ టైటిళ్లను ఇటీవలే అధిగమించిన హామిల్టన్‌.. ప్రపంచ డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ల్లోనూ అతడి రికార్డును సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కిష్‌ గ్రాండ్‌ ప్రిని గెలువడం ద్వారా కెరీర్‌లో 94వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న లూయిస్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2008లో మెక్‌లారెన్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌ ఆ తర్వాత ఆరుసార్లు (2014, 15, 17, 18, 19, 20) మెర్సెడెస్‌తో ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన టర్కిష్‌ రేసులో రెండో స్థానంలో నిలిచిన సెరిగో ప్రెజ్‌ కంటే 31 సెకన్లు ముందే హామిల్టన్‌ లక్ష్యాన్ని చేరి అలవోక విజయం సాధించాడు. విజయం తర్వాత భావోద్వేగానికి గురైన హామిల్టన్‌.. అసాధ్యాన్ని కలలు కనండి అంటూ చిన్నారులకు సందేశాన్నిచ్చాడు. కాగా ఫార్ములావన్‌లో అత్యధిక టైటిళ్లు (94), పోల్స్‌ (97), పోడియమ్‌లు (163), పాయింట్లు (3728) ఇలా ఎన్నో రికార్డులను నమోదు చేసిన హామిల్టన్‌.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ల్లోనూ ముందంజ వేసి గ్రేటెస్ట్‌ రేసర్‌గా అవతరించాడు.