e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home స్పోర్ట్స్ యువ కెరటాలు

యువ కెరటాలు

  • సెయిలింగ్‌లో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు
  • భారత నేవీ, ఆర్మీకి ఎంపికైన సునీల్‌, హర్షవర్ధన్‌

విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లో నుంచి పుట్టిన గురుకుల పాఠశాలలు దేశానికి చాంపియన్లను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. చదువులోనే కాదు క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టేందుకు విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. సెయిలింగ్‌ క్రీడలో తెలంగాణ యువ కెరటాలు సత్తాచాటుతున్నారు. గాలివాటాన్ని ఆసారాగా చేసుకొని అలలపై దూసుకెళ్లే సెయిలింగ్‌లో విజృంభిస్తున్న 19 మంది విద్యార్థులు భారత నేవీ, ఆర్మీకి ఎంపికయ్యారు. ఇందులో ఎక్కువ శాతం గురుకుల విద్యార్థులే కావడం విశేషం. పేదరికాన్ని లెక్క చేయకుండా తాము ఎంచుకున్న సెయిలింగ్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ప్రోత్సహంతో సెయిలింగ్‌లో విజయపథాన దూసుకెళుతున్న యువ సెయిలర్లు ముదావత్‌ సునీల్‌, ఎర్రా హర్షవర్ధన్‌పై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం

తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు ముదావత్‌ సునీల్‌, ఎర్రా హర్షవర్ధన్‌ ఇద్దరిది దాదాపు ఒకే నేపథ్యం. పేద కుటుంబం నుంచి వచ్చిన వీరిద్దరు విద్యలోనే కాదు క్రీడల్లోనూ సత్తాచాటాలన్న కసి ఉన్నవారు. సానబెడితే అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధమని నిరూపించినవారు. పసి ప్రాయంలోనే కష్టాలకు ఎదురొడ్డి నిలుస్తూ అలలపై ఉప్పొంగే కెరటాల వలే సెయిలింగ్‌లో దూసుకెళుతున్నారు.

సెయిలింగే నా జీవితం: హర్ష

- Advertisement -

రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం గాజీపూర్‌ గ్రామానికి చెందిన పేద రైతు కుటుంబంలో పుట్టిన ఎర్రా హర్షవర్ధన్‌ సెయిలింగ్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా భారత సైన్యంలో చోటు సంపాదించాడు. 10 ఏండ్ల వయసులో చిలుకూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చేరిన హర్ష సెయిలింగ్‌లో చక్కటి ప్రతిభ కనబర్చడం గుర్తించిన పీఈటీ అతడిని మరింత ప్రోత్సహించాడు. 2016-17లో పాఠశాలలో చేరిన హర్షవర్ధన్‌ 2018లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బక్క పల్చటి శరీరంతో అలలపై దూసుకెళ్తున్న హర్ష.. భవిష్యత్తులో మరింత ముందుకు దూసుకెళ్తాడని భావించిన పాఠశాల యాజమాన్యం అతడికి మెరుగైన శిక్షణ ఇప్పించింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని హర్ష జూనియర్‌ స్థాయిలో తెలంగాణలోనే ఉత్తమ సెయిలర్‌గా ఎదిగాడు. 15 దేశాల సెయిలర్లు పాల్గొన్న అంతర్జాతీయ పోటీల్లో టాప్‌-10లో నిలిచి శెభాష్‌ అనిపించుకున్నాడు. సెయిలింగ్‌లో హర్షవర్ధన్‌ కనబర్చిన ప్రతిభతో అతడికి ఆర్మీలో చేరే అవకాశం దక్కింది. మారుమూల గ్రామమైన గాజీపూర్‌లో కనీసం ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేని చోట తన కొడుకు పదిహేనేండ్లకే ఆర్మీకి ఎంపికవడం ఆనందంగా ఉందని హర్షవర్ధన్‌ తండ్రి చిన్న ఎల్లప్ప సంతోషం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్‌ ముందుచూపు.. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని హర్షవర్ధన్‌ తెలిపాడు. సెయిలింగే నా జీవితం అంటున్న హర్ష భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంతో పాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని అంటున్నాడు.

తండ్రిని కోల్పోయి..
వికారాబాద్‌ జిల్లా రాంపూర్‌తండాకు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన ముదావత్‌ సునీల్‌.. పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానై పెంచిన తల్లి బుద్దాబాయి.. అతడికి మంచి భవిష్యత్తును అందివ్వాలనుకుంది. ఆ ఉద్దేశంతో సునీల్‌ను.. బోయిన్‌పల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ వసతిగృహంలో చేర్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సునీల్‌.. 2018లో సెయిలింగ్‌ వైపు ఆకర్శితుడయ్యాడు.

ప్రతిభే పెట్టుబడిగా..
అలలపై అలవోకగా ముందుకు దూసుకెళ్లే సునీల్‌ను గుర్తించిన వైసీహెచ్‌ కోచ్‌ సుహైమ్‌ షేక్‌ అతడిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మెరుగులు అద్దాడు. గాలివాటాన్ని ఆసరాగా చేసుకొని ముందుకు సాగే సెయిలింగ్‌ క్రీడలో.. ఈ కుర్రాడు ఎంతో ఎత్తుకు ఎదగగలడని భావించిన సుహైమ్‌.. ఆ దిశగా ప్రోత్సహించాడు. టీచర్ల ప్రోత్సాహంతో పాటు సమీప బంధువైన వంశీ సూచనలతో సునీల్‌ తిరుగులేకుండా ఎదిగాడు. ఇప్పటివరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న సునీల్‌.. అంతర్జాతీయ పోటీల్లో రాణించడమే లక్ష్యంగాముందుకు సాగుతున్నాడు.

నేవీ, ఆర్మీకి ఎంపికైన 19 మందిలో 9 మంది తెలంగాణలోని మారుమూల గ్రామాల వాళ్లే ఉండడం గర్వంగా ఉంది. గిరిజన బాలుడు సునీల్‌ నేవీకి ఎంపిక కాగా.. మరో యువ సెయిలర్‌ పడిడాల విశ్వనాథ్‌ ఇటలీలో ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.

ప్రవీణ్‌ కుమార్‌, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana