మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 08, 2020 , 11:24:29

భలే మలుపు.. కివీస్‌ స్కోరు 273/8

భలే మలుపు.. కివీస్‌ స్కోరు 273/8

మార్టిన్‌ గప్తిల్‌(79: 79 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు), రాస్‌ టేలర్‌(73 నాటౌట్‌: 74 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది.

ఆక్లాండ్‌:  భారత్‌తో రెండో వన్డేలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మరోసారి బ్యాట్‌తో అదరగొట్టాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొని  జట్టును ఆదుకున్నాడు. మార్టిన్‌ గప్తిల్‌(79: 79 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు), రాస్‌ టేలర్‌(73 నాటౌట్‌: 74 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. నికోల్స్‌(41), టామ్‌ బ్లండెల్‌(22) ఫర్వాలేదనిపించారు. టేలర్‌ ఒంటరి పోరాటంతోనే కివీస్‌ ఈ స్కోరు చేయగలిగింది.  భారత బౌలర్లలో చాహల్(3/58)‌, శార్దుల్‌ ఠాకూర్‌(2/60) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. రెండో వన్డేలో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో టీమ్‌ఇండియా మెరుగైన ప్రదర్శన చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఇద్దరి మధ్య అటూ ఇటూ మారుతూ వచ్చింది.

  ఆరంభం అదుర్స్‌..

టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌కు గప్తిల్‌, నికోల్స్‌ మంచి అరంభం అందించారు. స్వేచ్ఛగా పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును నడిపించారు.   హెన్రీ, గప్తిల్‌ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు పటిష్ట పునాది వేశారు. అర్ధశతకం తర్వాత గప్తిల్‌ జోరు పెంచాడు.  30వ ఓవర్లో శార్దుల్‌ ఠాకూర్‌ మెరుపు ఫీల్డింగ్‌తో గప్తిల్‌ రనౌట్ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది.  వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆతిథ్య జట్టులో కాస్త ఆందోళన మొదలైంది.  ఆరంభంలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన కివీస్‌.. తర్వాత ఘోరంగా తడబడింది.  

ఒకానొక దశలో 142/1తో మెరుగైనస్థితిలో ఉన్న కివీస్‌..భారత్‌ బౌలర్ల మ్యాజిక్‌తో 187/7తో కష్టాల్లో పడింది.  పట్టుదలతో ఆడిన టేలర్‌ జట్టును మెరుగైన స్థితిలో నిలిపే ప్రయత్నం చేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా టేలర్‌  వెనుకడుగు వేయలేదు.  ఆరంభంలో ఓపెనర్ల జోరు చూస్తే స్కోరు 300కు పైగా చేస్తారనిపించింది. కానీ, అద్భుత బౌలింగ్‌, ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా కివీస్‌ను మధ్య ఓవర్లలో కట్టడి చేయడంలో విజయవంతమైంది. ముఖ్యంగా రనౌట్లు భారత్‌కు బాగా కలిసొచ్చాయి. 

టేలర్‌ సూపర్‌ షో..

ఆతిథ్య జట్టును కీలక సమయాల్లో దెబ్బకొట్టిన కోహ్లీసేన ఆటపై పట్టుకోల్పోకుండా చూసుకుంది.  45 పరుగుల వ్యవధిలో న్యూజిలాండ్‌ ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో  మ్యాచ్‌లో  భారత్‌  పైచేయి సాధించినట్లే  కనిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. టేలర్‌, జేమిసన్‌(25 నాటౌట్‌: 24 బంతుల్లో ఫోర్‌, 2సిక్సర్లు) బౌండరీలతో విరుచుపడి స్కోరును 270 దాటించారు. logo
>>>>>>