టెస్టు కెప్టెన్‌గా రహానేకు పెరుగుతున్న మద్దతు

- ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను ఓడించడం ప్రపంచ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ అని ఒకరు అంటుంటే.. ఇకపై ఆసీస్ జట్టు కఠినమైనదేమి కాదని మరొకరు బల్లగుద్ది చెబుతున్నారు. కష్టకాలంలో సిరాజ్ చక్కగా బౌలింగ్ చేశారని ఒకరంటే.. శార్దూల్, సుందర్ పోరాటాన్ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అని మరొకరు ఘంటాపథంగా చెబుతున్నారు. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ వల్లే.. టీమ్ఇండియా ఇంత పటిష్టంగా మారిందని పాకిస్థాన్ ఆటగాళ్లు అంటుంటే.. భారత్‌లో మాత్రం కోహ్లీ కన్నా.. టెస్టు కెప్టెన్‌గా రహానేనే ఉత్తమమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్లలో రోహిత్ మెరుగైన ప్రదర్శన చేసిన ప్రతీసారి టీ20లకు అతడిని కెప్టెన్ చేయాలనే వాదనలు వినిపించిన తరహాలోనే.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లో జింక్స్కు పగ్గాలు ఇవ్వాలనే వారి సంఖ్య పెరుగుతూ పోతున్నది. పోలికలను పక్కనపెట్టి.. ఈ సిరీస్‌లో రహానే గేమ్‌ప్లాన్‌ను ఓ సారి పరిశీలిస్తే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: అజింక్యా రహానే చేతికి పగ్గాలు వచ్చే సమయానికి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదు చేసిం ది. అడిలైడ్ ఓటమితో ఆత్మవిశ్వాసం లోపించిన సమయంలో రహానే జట్టులో ధైర్యం నింపాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో తీవ్ర ఒత్తిడి మధ్య కూడా ప్రశాంతంగా పనికానిచ్చా డు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి సెషన్‌కు ముందే అశ్విన్‌కు బంతినిచ్చి ఆశ్చర్యపరిచాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అశ్విన్ విజృంభించడంతో ఆసీస్ టాపార్డర్ కుదురుకోలేకపోయింది. ముఖ్యంగా స్మిత్‌ను ఔట్ చేసేందుకు అతడు పన్నిన వల ఎంత పకడ్బందీగా ఉందంటే.. ఆ తర్వా త సుందర్ దాన్ని ఫాలో అవుతూ స్మిత్‌ను బుట్టలో వేసుకోగలిగాడు.
బౌలర్ బలాన్ని పసిగట్టి..
భారత్-ఏ తరఫున విదేశీ పర్యటనల్లో రాణించిన మహమ్మద్ సిరాజ్ పాత బంతితో స్వింగ్ రాబట్టగలడని తెలిసిన రహానే.. మెల్బోర్న్లో అతడికి ఆలస్యంగా బంతినిచ్చాడు. షమీ వంటి సీనియర్ బౌలర్ అందుబాటులో లేకున్నా.. బుమ్రా, ఉమేశ్ ఇద్దరినీ సమయానుగుణంగా వాడుకుంటూ.. సిరాజ్‌ను పాత బంతికోసం దాచిపెట్టాడు. ఈ పాచిక పారడంతో.. లబుషేన్, గ్రీన్ ఔటయ్యారు. బుమ్రా కూడా విజృంభించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో రెండొందలలోపే ఆలౌటైంది.
ప్రయోగాలకు వెరవని తత్వం
సిరీస్ ఆరంభానికి ముందు 20 మంది ఆటగాళ్లు ఉన్నా.. చివరి టెస్టు కోసం జట్టును ఎంపికచేద్దామంటే కనీసం 11 మంది ఆటగాళ్లు అందుబాటులో లేని పరిస్థితి. అయినా రహానే ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఓపెనర్‌గా విఫలమైన ఆటగాడిని మిడిలార్డర్ కోసం ఎంపిక చేసుకున్నాడు. సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో బ్రిస్బేన్‌లో అనుభవం లేని బౌలర్లతోనే అద్భుతాలు చేశాడు. మైదానంలో పెద్దగా దూకుడుగా కనిపించని రహానే.. గబ్బాలో రిషబ్ పంత్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కానీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేదంటే అతిశయోక్తికాదు.
జాత్యహంకార వ్యాఖ్యలకు తట్టుకొని..
సిడ్నీ టెస్టు సందర్భంగా ఆసీస్ అల్లరి మూక భారత జట్టు ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలకు తెగబడగా.. వాటిని పెద్దగా పట్టించుకోవద్దని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఒక దశలో కావాలనుకుంటే మ్యాచ్‌ను వదిలి మీరు వెళ్లిపోవచ్చు అని అంపైర్లు చెప్పినా.. ‘మేం ఎలాంటి తప్పు చేయలేదు. బయటికి ఎందుకు వెళ్తాం’అని వాదించి మైదానంలో నిలబడ్డాడు.
ఏకైక సెంచరీ
మెల్బోర్న్లో కంగారూలను తక్కువ పరుగులకు పరిమితం చేశామనే ఆనందం కన్నా బ్యాట్‌తో మనవాళ్లు ఏం చేస్తారో అనే ఆందోళనలు మనసులో ముసురుకుంటున్న సమయంలో రహానే అద్భుత సెంచరీతో వాటిని పటా పంచలు చేశాడు. సిరీస్ మొత్తంలో భారత్ తరఫున నమోదైన ఏకైక శతకం ఇదే. రహానే స్ఫూర్తితో తలాకొన్ని పరుగులు చేయగా.. మంచి ఆధిక్యం సాధించిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడిచేసి గెలుపొందింది.
లియాన్‌కు గిఫ్ట్
ప్రత్యర్థిని గౌరవించడంలో సదా ముందుండే రహానే.. చివరి టెస్టులో ఆసీస్ తరఫున వందో మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ లియాన్‌కు టీమ్ఇండియా సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు.
విరాట్ సారథ్యం వదులుకోవాలి: బేడీ
- రహానే పటౌడీని గుర్తుకు తెస్తున్నాడు
ఆసీస్ గడ్డపై కష్టకాలంలో పరిమిత వనరులతోనే అద్భుతాలు సృష్టించిన రహానేకే టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని భారత మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ధైర్యం సెలెక్టర్లు చేయలేరని.. కోహ్లీనే ముందుకొచ్చి రహానేకు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని బేడీ పేర్కొన్నాడు. భారత జట్టుకు కోహ్లీలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మన్ కావాలో తేల్చుకోవాలని అన్నాడు. రహానేను చూస్తుంటే తనకు టైగర్ పటౌడీ కెప్టెన్సీయే గుర్తుకు వస్తున్నదని బేడీ అన్నాడు. పటౌడీ కాలంలోనూ తగిన వనరులు లేకపోయినా.. జట్టుకు విజయాలు అందించేవాడని చెప్పాడు.
అపూర్వ స్వాగతం..
ఆసీస్ గడ్డపై అద్భుత విజయం అనంతరం ముంబైలో అడుగుపెట్టిన రహానేకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు దారిపొడవునా నిల్చొని అతడికి స్వాగతం పలికారు. ఈ ఫలితం తర్వాత రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలనే వాదన ఎక్కువైన మాట వాస్తవమే కానీ.. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ చెప్పినట్లు ఈ విజయం వెనుక రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కృషి ఉందనేది మరువకూడదు.
తాజావార్తలు
- ఏ1 ఎక్స్‌ప్రెస్ రివ్యూ
- నలుగురితో పారిపోయి.. లక్కీ డ్రాలో ఒకరిని పెండ్లాడింది
- కూతురిని వేధిస్తున్న యువకుడికి మందలింపు : మహిళను కాల్చిచంపిన ఆకతాయి!
- పసిబిడ్డలకు ఉరేసి.. తానూ ఉసురు తీసుకుని..!
- తీరానికి కొట్టుకొచ్చిన.. 23 అడుగుల మిస్టరీ సముద్ర జీవి
- కరోనా టీకా వేయించుకున్న రాజస్థాన్ సీఎం
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..