సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 13, 2020 , 00:42:41

నయా వాల్‌ రాహుల్‌..!

నయా వాల్‌ రాహుల్‌..!

స్థానమేదైనా.. పిచ్‌ ఎలాంటిదైనా.. ప్రత్యర్థి ఏ జట్టయినా.. అదే దూకుడు, అదే ఆత్మవిశ్వాసం, అదే నిలకడతో లోకేశ్‌ రాహుల్‌ రెచ్చిపోతున్నాడు. పరుగుల వరద పారిస్తూ టీమ్‌ఇండియాకు ఆపద్బాంధవుడిలా మారాడు. ఓపెనింగ్‌, మిడిలార్డర్‌.. బ్యాటింగ్‌లో ఎక్కడొచ్చినా దుమ్ముదులుపుతున్న రాహుల్‌... వికెట్‌ కీపింగ్‌లోనూ అంతే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. మూడు నెలల క్రితం వరకు జట్టులోకి వస్తూ పోతూ ఉన్న ఈ కర్ణాటక కెరటం తనలోని కసినంతా పరుగులుగా మలుస్తూ విశ్వరూపమే చూపుతున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణిస్తూ.. దిగ్గజ రాహుల్‌ ద్రవిడ్‌తో పోల్చేంతలా ఈ రాహుల్‌ ఆకట్టుకుంటున్నాడు.

రాహుల్‌ ద్రవిడ్‌.. భారత క్రికెట్‌ దిగ్గజం. తన అత్యున్నత టెక్నిక్‌, అసమాన ప్రతిభ, అంకితభావంతో ప్రపంచ మేటి బౌలర్లకు చెమటలు పట్టించాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా క్రీజులో పాతుకుపోయి ఎన్నోసార్లు జట్టును పరాజయాల నుంచి కాపాడాడు. జట్టుకు ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్నాడు. అవసరమైనప్పుడుల్లా వికెట్‌ కీపింగ్‌ చేస్తూ అన్ని విధాల జట్టు కోసం ద్రవిడ్‌ చెమటోడ్చాడు. పరిమిత ఓవర్ల వరకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో విరాట్‌ కోహ్లీని కొందరు పోల్చినా మరో ద్రవిడ్‌ అంటూ ఇంకెవరినీ అనలేదు.  అయితే, ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ద్రవిడ్‌తో పోల్చగల ఆ పేరున్న ప్లేయరే వచ్చాడు. అతడే టీమ్‌ఇండియా     నయా స్టార్‌  కేఎల్‌ రాహుల్‌. మూడు నెలల క్రితం వరకు భారత జట్టులో చోటు ఉంటుందో లేదో అనే అనుమానం నుంచి ఇప్పుడు జట్టులో అతడు ఉండాల్సిందేనన్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్లేస్‌ కోసం పడిగాపుల నుంచి ప్రధాన ప్లేయర్‌గా ఎదగడం వరకు కేఎల్‌ రాహుల్‌  కెరీర్‌ ఒడిదొడుకులపై ప్రత్యేక కథనం..  


దేశవాళీల్లో నిరూపించుకొని... 

టీమ్‌ఇండియా టెస్టు, వన్డే జట్టులో చోటు కోల్పోయాక కర్ణాటక కెరటం కేఎల్‌ రాహుల్‌ దేశవాళీ క్రికెట్‌లో  విశేషంగా     రాణించాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2019-20లో 66.44సగటుతో 598 పరుగులతో అదరగొట్టాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ 52కు పైగా సగటుతో 331పరుగులు చేశాడు. దీంతో  టీమ్‌ఇండియా సెలెక్టర్ల నుంచి రాహుల్‌కు మళ్లీ పిలుపొచ్చింది. 


కొత్త అవతారం 

వెస్టిండీస్‌ తర్వాత శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ కేఎల్‌ రాహులే టాప్‌స్కోరర్‌గా నిలిచి ఏ దశలోనూ తగ్గేదిలేదన్నట్టు చెలరేగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న ధవన్‌.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం జట్టులోకి వచ్చేశాడు. ధవన్‌ను కాదనలేని పరిస్థితి.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను తప్పిస్తే జట్టుకే నష్టం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు ఆటగాడు, కెప్టెన్‌ కోహ్లీనే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ధవన్‌, రోహిత్‌ శర్మను ఓపెనింగ్‌కు పంపి రాహుల్‌ (47)ను వన్‌డౌన్‌లో పంపాడు.   అయితే, ఆ ప్రయోగం సఫలం కాకపోవడంతో రాహుల్‌ను ఆ తర్వాతి మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బరిలోకి దింపారు. పంత్‌కు గాయ మవడంతో తొలి మ్యాచ్‌ నుంచి రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. రెండో వన్డేలో ఐదో స్థానంలో వచ్చిన రాహుల్‌ విశ్వరూపమే చూపాడు. 52 బంతుల్లోనే 80పరుగులు బాది తనలో మంచి ఫినిషర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.  రాహుల్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ను వదులుకోవడం ఎంతో కష్టమని కోహ్లీ సైతం అన్నాడంటే అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థమవుతుంది. కీపర్‌గానూ రెండు క్యాచ్‌లు సహా ఓ స్టంపింగ్‌తో రాణించాడు. చివరి వన్డేలో మళ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 146పరుగులతో అదరగొట్టి జట్టులో చోటు పక్కా చేసుకున్నాడు. 


ఒకేఒక్కడిగా.. 

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన చేసినా.. రాహుల్‌ తన ప్రైమ్‌ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సిరీస్‌లోనూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఐదో స్థానంలో దిగిన కేఎల్‌.. తొలి వన్డేలో 64బంతుల్లోనే 88పరుగులు బాది జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో మ్యాచ్‌లో త్వరగానే వెనుదిరిగినా.. చివరి మ్యాచ్‌లో రెట్టించిన కసితో ఆడాడు. శతకం(112) బాది జీవిత కాల ఫామ్‌ను కొనసాగించాడు. ఇక వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో స్థిరపడట్టేనని చెప్పొచ్చు.   


కీపర్‌గానూ సఫలం 

స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ గాయపడడంతో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌ చేపట్టాడు. దేశవాళీ సహా ఐపీఎల్‌ల్లోనూ కీపింగ్‌ చేసిన అనుభవంతో ఆ బాధ్యతను రాహుల్‌ చక్కగా నిర్వర్తించాడు. రెగ్యులర్‌ కీపర్‌కు ఏ మాత్రం తగ్గకపోవడం, పంత్‌ కూడా పేలవంగా ఆడుతుండడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడు రెగ్యులర్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. కివీస్‌ గడ్డపై బ్యాటింగ్‌లో రాణించిన తీరుగానే గ్లౌవ్స్‌తోనూ అదరగొట్టాడు. క్యాచ్‌లు ఒడిసిపట్టుకోవడంలోనూ, స్టంపౌట్లు చేయడంలోనూ ఎక్కడా తడబడలేదు. 


ఎందుకలా..

ఇంత భీకర ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై జహీర్‌ ఖాన్‌ సహా కొందరు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక అభిమానులైతే సోషల్‌ మీడియా వేదికగా హోరెత్తించారు. మూడు ఫార్మాట్లలో ఏ పరిస్థితుల్లోనైనా రాణించే సామర్థ్యంతో పాటు ఏ స్థానంలోనైనా ఆడే రాహుల్‌ను ఎందుకు తీసుకోలేదని సెలెక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. 


కివీస్‌ గడ్డపై సింహనాదం..

గత నెల ప్రారంభమైన న్యూజిలాండ్‌ పర్యటనలో కేఎల్‌ రాహుల్‌ దూకుడు మరింత పెరిగింది. అతడి షాట్ల ఎంపిక, ఆత్మవిశ్వాసం, హిట్టింగ్‌ చూసి వారెవ్వా అనని క్రికెట్‌ అభిమాని ఉండడు. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా అనుకునేలా అతడు బాదిన కొన్ని షాట్లకు మాజీలు సైతం ఫిదా అయిపోయారు. ఐదు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ రెండు అర్ధశతకాలు సహా 224పరుగులతో విదేశీ గడ్డపైనా మెరుపులు మెరిపించాడు.  56కు పైగా సగటు నమోదు చేయడంతో పాటు సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. సిరీస్‌ను 5-0తో కివీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో ప్రధాన పాత్ర రాహుల్‌దే.


రాహుల్‌ 2.0

గాయం కారణంగా స్వదేశంలో గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు శిఖర్‌ ధవన్‌ దూరమయ్యాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇది వరకు జరిగిన తప్పులను పునరావృతం చేయకూడదని నిశ్చయించుకున్న లోకేశ్‌.. విండీస్‌పై ప్రతాపం చూపాలని పట్టుదల కనబ రిచాడు. దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తనను తాను నాయకుడిగా భావించుకున్నాడు. ఆ సిరీస్‌లో బ్యాటింగ్‌ శైలితోనే అతడు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాడు. మూడు టీ20ల్లో రెండు అర్ధశతకాలు సహా 164పరుగులు చేశాడు. దీంతో తర్వాతి మూడు వన్డేల సిరీస్‌కు ఓపెనర్‌గానే కొనసాగాడు.  మొత్తం ఓ శతకం సహా 185 పరుగులతో ఆ సిరీస్‌లో సత్తాచాటాడు.


దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకొని 2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై కేఎల్‌ రాహుల్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాతి నెలలో తాను ఆడిన రెండో టెస్టులోనే భీకర ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని సిడ్నీలో శతకంతో కదం తొక్కాడు. 2017 వరకు 4శతకాలతో పాటు 43పైగా బ్యాటింగ్‌ సగటుతో రాణించాడు. ఆ తర్వాత సంప్రదాయ ఫార్మాట్‌లో రాహుల్‌ తడబాటు మొదలైంది. తర్వాతి రెండేండ్లలో జరిగిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ పర్యటనల్లో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో  కర్ణాటకకే చెందిన మయాంక్‌ అగర్వాల్‌.. రాహుల్‌ స్థానంలో వచ్చాడు. వన్డేల్లోనూ 2016లో అరంగేట్రం చేసిన రాహుల్‌ ఏ స్థితిలోనూ క్రమంగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. దేశవాళీలు, ఐపీఎల్‌తో పాటు అప్పుడప్పుడూ రాణించడంతో 2019 ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కింది. విశ్వకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 45కు పైగా సగటుతో 360పరుగులతో రాహుల్‌ ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత విండీస్‌తో ఆ దేశంలో జరిగిన సిరీస్‌లో చోటు కోల్పోయాడు. అయితే, పొట్టిఫార్మాట్‌లో 2016లో అరంగేట్రం చేసిన కేఎల్‌ రాహుల్‌  నిలకడగా అదరగొడుతూ.. టీమ్‌ ఇండియా టీ20 జట్టులో మాత్రం రెగ్యులర్‌ ప్లేయర్‌గానే కొనసాగుతున్నాడు. 


12వ ఆటగాడిగా కూడా శతకం చేస్తావ్‌ 

కేఎల్‌ రాహుల్‌ భీకర ఫామ్‌పై టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌  ఇన్‌స్టాగ్రామ్‌లో చమత్కారంగా పోస్ట్‌  పెట్టాడు. ‘బాగా ఆడావు, అద్భుతమైన శతకం. ఇలాగే సమర్థవంతంగా కొనసాగు రాహుల్‌. నీ బ్యాటింగ్‌ తీరు చూస్తుంటే.. ఒకవేళ జట్టులో 12వ ఆటగాడిగా ఉన్నా శతకం చేస్తావనిపిస్తున్నది’ అని ధవన్‌ పేర్కొన్నాడు.logo