మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 19, 2020 , 23:46:35

బాడీ బిల్డింగ్‌.. ఫుల్‌ థ్రిల్లింగ్‌..

బాడీ బిల్డింగ్‌.. ఫుల్‌ థ్రిల్లింగ్‌..

  • వరుస టైటిల్స్‌తో దూసుకెళ్తున్న గోపు శ్రీనివాస్‌
  • అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న మంచిర్యాలవాసి

నలుగురిలో ప్రత్యేకంగా నిలువాలన్న తపన ఆ యువకుడిని బాడీబిల్డింగ్‌వైపు అడుగులు వేయించింది. శరీర దారుఢ్యాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తితో జిమ్‌లో అడుగుపెట్టిన అతడు..అంచెలంచెలుగా ఎదుగుతూ మిస్టర్‌ తెలంగాణ టైటిల్‌ అందుకున్నాడు. లక్ష్యంపై స్పష్టత.. గమ్యంపై అవగాహన.. విజయం సాధించాలనే పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం పెద్ద కష్టం కాదని నిరూపిస్తూ.. మిస్టర్‌ ఇండియా టైటిల్‌ నెగ్గేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. పూటగడవడానికే కష్టమైన పేదింట్లో పుట్టి.. ఖర్చుతో కూడుకున్న కాస్ట్‌లీ క్రీడలో రాణిస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న మంచిర్యాలకు చెందిన గోపు శ్రీనివాస్‌పై ప్రత్యేక కథనం..

మంచిర్యాల అగ్రికల్చర్‌: బాడీ బిల్డింగ్‌.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే మొదటి అంశం ప్రత్యేక డైట్‌. ప్రొటీన్స్‌, మినరల్స్‌, కార్బోహైడ్రేట్స్‌, ఎగ్‌వైట్స్‌, చికెన్‌, మటన్‌, చేపలు.. ఇలా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించే స్థోమత ఉంటేనే ఈ రంగంలో రాణించగలరనే నమ్మకం ప్రజల్లో పాతుకుపోయింది. మరి అలాంటి కాస్ట్‌లీ క్రీడలో మంచిర్యాలకు చెందిన గోపు శ్రీనివాస్‌ చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు. జిల్లా స్థాయి పోటీలతో ప్రారంభించిన తన ప్రయాణాన్ని.. వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మిస్టర్‌ తెలంగాణ, మిస్టర్‌ సౌత్‌ఇండియా టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్న శ్రీనివాస్‌.. ప్రస్తుతం సీనియర్‌ నేషనల్స్‌ కోసం సిద్ధమవుతున్నాడు. 2017లో మంగోలియా వేదికగా జరిగిన ప్రపంచ మెన్స్‌ జూనియర్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ 75 కేజీల విభాగంలో తృతీయ స్థానం దక్కించుకున్న శ్రీనివాస్‌.. 2018 ప్రపంచ బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో అదే విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర ఖ్యాతిని పెంచాడు.

కఠోర సాధనతో..

మంచిర్యాలలోని గోపాల్‌వాడకు చెందిన గోపు మధునమ్మ, రాజలింగుల రెండో కుమారుడైన గోపు శ్రీనివాస్‌.. చిన్నప్పటి నుంచే బాడీబిల్డింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఎక్కడ బాడీబిల్డింగ్‌ పోటీలు జరిగినా.. చూసేందుకు ఆసక్తికనబరిచే అతడు.. తాను కూడా వాళ్లలా కావాలని సంకల్పించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా చిన్నాన్న కొడుకు కృష్ణ సహకారంతో జిమ్‌కు వెళ్లడం మొదలెట్టాడు. ఏదో వెళ్లామా వచ్చామా అన్నట్టు కాకుండా.. లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో కఠోర సాధన చేశాడు. శిక్షణలో మెళకువలు నేర్చుకుంటూనే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరు స్తూ  అంచెలంచెలుగా ఎదిగాడు.

ఖర్చుకు వెరువకుండా..

ప్రత్యేక డైట్‌ కొనసాగించేదుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముం దుకు సాగుతున్న శ్రీనివాస్‌.. ప్రస్తుతం జిమ్‌లో శిక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు. నిత్యం ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేయడంతో పాటు అందుకు తగిన ఆహార నియమాలను పాటిస్తున్నాడు. సరైన నిద్ర, తగినంత విశ్రాంతితో శిక్షణ కొనసాగించడం వల్లే ఫలితాలు రాబట్టగలుగుతున్నానని అంటున్న శ్రీనివాస్‌.. ఓవైపు విద్యార్థులకు బాడీ బిల్డింగ్‌లో శిక్షణ ఇస్తూనే మరోవైపు తాను ఒక విద్యార్థిగా మిస్టర్‌ ఇండియా టైటిల్‌ గ్రహీత తుండిపరంబిల్‌ రామకృష్ణ వ ద్ద సాధన కొనసాగిస్తున్నాడు. మిస్టర్‌ ఇం డియా టైటిల్‌ నెగ్గి.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యో గం సాధించడమే తనలక్ష్యం అని అంటున్న శ్రీనివాస్‌.. కల నెరవేరలని ఆశిద్దాం!

అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన పతకాలు

2017 దక్షిణ కొరియా వేదికగా , జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్‌,చాంపియన్‌షిప్‌ 75 కేజీల ,విభాగంలో తృతీయ స్థానం.

2017 మంగోలియా వేదికగా జరిగిన ,ప్రపంచ జూనియర్‌ , బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ ,75 కేజీల విభాగంలో తృతీయ స్థానం.

2018 థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన , డబ్ల్యూబీపీఎఫ్‌  జూనియర్‌ ,బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ 75 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం.

సాధన కోసం చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. ప్రత్యేక డైట్‌ కోసం జిమ్‌లో శిక్షణ ఇస్తున్నా. ఉదయం, సాయంత్రం జిమ్‌లో సాధన చేసే ముందు ప్రొటీన్‌, ఎనర్జీ డ్రింక్స్‌, బాదం తీసుకుంటా. వ్యాయామానికి ముందు ఉడికించిన కోడిగుడ్లలోని తెల్లసొనతో పాటు, పండ్లు తీసుకోవాల్సిందే. వ్యాయామం అనంతరం అరకిలో చికెన్‌, వెజిటెబుల్‌ సలాడ్లు, మధ్యాహ్నం అరకిలో చేపలు, అరకిలో చికెన్‌, బ్రౌన్‌ రైస్‌ తప్పనిసరి. సాయంత్రం క్యారెట్‌, కీరదోస, రాత్రి మళ్లీ చికెన్‌, బ్రౌన్‌రెస్‌ తీసుకుంటా. మధ్యమధ్యలో ప్రత్యేక డైట్‌ ఉండాల్సిందే. ఇలా రోజుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతున్నది. ప్రస్తుతం సీనియర్‌ నేషనల్స్‌ కోసం సిద్ధమవుతున్నా.. మధ్యప్రదేశ్‌లో జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌ కోసం వరంగల్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ఎప్పటికైనా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.

- గోపు శ్రీనివాస్‌


logo
>>>>>>