బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 24, 2021 , 07:22:39

రోడ్డు ప్రమాదంలో టైగర్‌ వుడ్స్‌కు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో టైగర్‌ వుడ్స్‌కు తీవ్రగాయాలు

కాలిఫోర్నియా : ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో అతడు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం నుజ్జునుజ్జయింది. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న లాస్‌ఏంజిల్స్‌ అగ్నిమాపక, పారామెడికల్‌ సిబ్బంది ఆయనను కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అతని కాలికి తీవ్ర గాయాలవగా.. శస్త్ర చికిత్స చేశారు. కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో జరిగిన ఈ ఘటన సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కడే అందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.12గంటలకు ఈ ప్రమాదం జరిగింది.


ఇదిలా ఉండగా.. గోల్ఫ్‌ ప్రపంచ చాంపియన్‌ రోడ్డు ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు 2009, 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురైంది. మొదటి రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ఐదు నెలలు మిస్సిసీపి రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపాడు. రెండో ప్రమాదంలోనూ కొద్ది నెలలకు కోలుకుని గోల్ఫ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. మరోసారి ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. టైగర్‌ వుడ్స్‌ ఇప్పటి వరకు 15 ప్రధాన గోల్ఫ్‌ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. చివరిసారిగా 2019లో టైటిల్‌ను గెలిచాడు. త్వరలోనే జరుగబోయే మాస్టర్స్‌ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది.


VIDEOS

logo