బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 26, 2020 , 23:09:34

కోల్‌కతా బోణీ.. హైదరాబాద్‌ వరుసగా రెండో పరాజయం

కోల్‌కతా బోణీ.. హైదరాబాద్‌ వరుసగా రెండో పరాజయం

అబుదాబి:  ఐపీఎల్‌-13వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ కొట్టింది.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా ఛేదించింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(70 నాటౌట్:‌ 62 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మిడిలార్డర్‌లో ఇయాన్‌ మోర్గాన్‌(42 నాటౌట్‌) కీలక సమయంలో విజృంభించాడు.  సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే(51: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఒంటరి  పోరాటం వృథా అయింది. అన్ని విభాగాల్లో తేలిపోయిన  డేవిడ్‌ వార్నర్‌ సేన వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. 

 లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలో వరుస ఓవర్లలోనే మూడు వికెట్లు   కోల్పోయింది.  ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.  వన్‌డౌన్‌లో వచ్చిన రాణా..ఖలీల్‌ అహ్మద్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 14 రన్స్‌ రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు. స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికే కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు.

 అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ఈ దశలో క్రీజులో ఉన్న గిల్‌, మోర్గాన్‌ స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ లక్ష్యం దిశగా సాగారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. గిల్‌, మోర్గాన్‌ జోడీ ఆఖరి వరకు నిలిచి రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. 

సన్‌రైజర్స్‌కు మళ్లీ  శుభారంభం లభించలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు  ఇన్నింగ్స్‌   మెరుపులు లేకుండానే సాగింది.  పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌ స్టో(5) బౌల్డ్‌ అయ్యాడు.  వార్నర్‌(36) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.  యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ ..రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు.   వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది.  మనీశ్‌ పాండే ఒక్కడే స్ఫూర్తిదాయక ప్రదర్శనతో   జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.  డేవిడ్‌ వార్నర్‌(36), వృద్ధిమాన్‌ సాహా(30) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేశారు. బ్యాట్స్‌మన్‌ స్వేచ్ఛగా ఆడకుండా నిలువరించారు.       మధ్య ఓవర్లలో  కోల్‌కతా బౌలర్లు పరుగులను నియంత్రించారు.