శుక్రవారం 03 జూలై 2020
Sports - May 16, 2020 , 01:16:31

బుందెస్లిగా షురూ

బుందెస్లిగా షురూ

  • నేడు జర్మనీ మేజర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ పునఃప్రారంభం
  •  ప్రేక్షకులు లేకుండా నిర్వహణ  
  • క్రమంగా మొదలవుతున్న క్రీడాపోటీలు 

కరోనా వైరస్‌ విజృంభణతో అతలాకుతలమైన క్రీడా ప్రపంచం కాస్త కోలుకుంటున్నది. దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే కొన్ని క్రీడా పోటీలు ప్రారంభమైనా.. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న జర్మనీ ఫుట్‌బాల్‌ లీగ్‌ ‘బుందెస్లిగా’నే మహమ్మారి దెబ్బ తర్వాత మళ్లీ షురూ కానున్న మేజర్‌ టోర్నీ. దాదాపు 80వేల సామర్థ్యమున్న సిగ్నల్‌ ఈడూనా పార్క్‌ సహా మిగిలిన స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే బుందెస్లిగా కొనసాగనుంది. అలాగే పోటీ ల్లో కరచాలనాలు, ఆలింగనాలు కనుమరుగు కానుండగా కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య టోర్నీ సాగనుంది. కాగా క్రీడాపోటీల ప్రారంభంపై తర్జనభర్జన పడుతున్న దేశాలన్నీ ఈ టోర్నీవైపే చూస్తున్నాయి. 

బెర్లిన్‌: జర్మనీలో ఫుట్‌బాల్‌ సందడి మళ్లీ మొదలవనుంది. కరోనా వైరస్‌ దెబ్బతో రెండు నెలలు నిలిచిపోయిన ప్రధాన లీగ్‌ బుందెస్లిగా శనివారం పునఃప్రారంభం కానుంది. మహమ్మారి క్రీడా ప్రపంచాన్ని దెబ్బకొట్టాక షురూ అవుతున్న మేజర్‌ టోర్నీ ఇదే. యూరప్‌లోనే ప్రధాన సాకర్‌ సమరంగా పరిగణించే ఈ టోర్నీ  సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ప్రేక్షకులు లేకుండా జరుగనుంది. దాదాపు 80వేలకు పైగా సీటింగ్‌ సామర్థ్యమున్న సిగ్నల్‌ ఈడూనా పార్క్‌ సహా మిగిలిన మైదానాలు ప్రేక్షకులు లేకుండా బోసి పోనున్నాయి. ఆటగాళ్లు, కోచ్‌లు, టోర్నీ అధికారులు, మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీ ఇలా మొత్తం 300 మందిలోపే స్టేడియాల్లో ఉండనున్నారు. 18జట్లు ఉన్న టోర్నీ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్‌ చాంపియన్‌ బేయర్న్‌ మ్యూనిచ్‌ అగ్రస్థానంలో ఉండి.. వరుసగా ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. 

కట్టుదిట్టమైన జాగ్రత్తలు 

కరోనా వైరస్‌ భయాందోళనల మధ్య సాగనున్న ఈ టోర్నీ కోసం జర్మన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించింది. ఆటగాళ్లు, కోచ్‌లు సహా ప్రతి ఒక్కరూ వైద్యపరమైన మార్గదర్శకాలను తప్పకపాటించేలా జాగ్రత్తలు తీసుకోనుంది. కరచాలనాలు, ఆలింగనాలు పోటీల్లో కనుమరుగు కానుండగా.. మ్యాచ్‌లో సైతం ఆటగాళ్లు వీలైనంత మేర ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండాలని సూచనలు జారీ చేశారు. దీంతో గోల్‌ చేసినా ఆటగాళ్లు సంబురాలు వినూత్నంగా చేసుకోనున్నారు. మ్యాచ్‌ జరిగే సమయంలో ఆటగాళ్లు మినహా మిగిలిన వారందరూ మాస్కులు ధరించనున్నారు. 

ప్రేక్షకులు ఉన్నట్టే.. 

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరిగినా.. టీవీల్లో చూసే వారికి వెలితిగా ఉండకుండా  టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్కై నెట్‌వర్క్‌ వినూత్న సదుపాయాన్ని తీసుకొచ్చింది. టీవీల్లో మ్యాచ్‌లు చూసే వీక్షకులకు స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతి కలిగించేందుకు.. ఇంతకు ముందు రికార్డు చేసిన కేరింతలు, పాటలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌గా ప్రసారం చేయనుంది. ఇలా వద్దనుకుంటే మామూలుగానే మ్యాచ్‌ చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. 

పేస్ట్‌ కోసం బయటికెళ్లి.. 

టూత్‌పేస్ట్‌ కొనేందుకు క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన అన్స్‌బర్గ్‌ జట్టు కోచ్‌ హీకో హెర్లిచ్‌.. పునఃప్రారంభం కానున్న బుందెస్లిగా పోటీలకు దూరంగా ఉండనున్నాడు. టూత్‌పేస్ట్‌, స్కిన్‌ క్రీమ్‌ కోసం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లానని, హోటల్‌ను విడిచివెళ్లి తప్పు చేశానని అతడు అంగీకరించాడు. 


logo