బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 22:56:46

విరాళంగా రెండేండ్ల వేతనం

విరాళంగా రెండేండ్ల వేతనం

  • మరోసారి ఉదారత చాటిన గౌతమ్‌ గంభీర్‌ 

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌.. కరోనాపై యుద్ధానికి మరోసారి విరాళం ప్రకటించాడు. మహమ్మారిపై యుద్ధానికి తన రెండేండ్ల వేతనాన్ని ప్రధానమంత్రి-కేర్స్‌ నిధికి విరాళంగా ఇచ్చాడు. అలాగే ప్రజలు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. దేశం మనకు ఏమిచ్చిందనేది కాకుండా.. మనం దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలని గంభీర్‌ గురువారం ట్వీట్‌ చేశాడు.  నెల వేతనంతో పాటు రూ.కోటి ఎంపీ ల్యాడ్స్‌ నిధులను ఇదివరకే పీఎం-కేర్స్‌ నిధికి గౌతీ అందజేశాడు. అంతకు ముందు రూ.50లక్షలకు పీఎం సహాయ నిధికి ఇచ్చాడు. 

శ్రీధర్‌ రూ.4లక్షలు 

టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌, హైదరాబాద్‌ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఆర్‌.శ్రీధర్‌  రూ.4లక్షలను విరాళంగా ప్రకటించాడు. భారత పౌరుడిగా గర్విస్తూ నా విధిని నిర్వర్తిస్తున్నా. రూ.2లక్షలను పీఎం కేర్స్‌ నిధికి, రూ.1.50లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, రూ.50వేలను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు అందజేస్తున్నా అని శ్రీధర్‌ గురువారం ట్వీట్‌ చేశాడు. 

షూటర్‌ అపూర్వి రూ. 5లక్షల విరాళం

కామన్వెల్త్‌ స్వర్ణపతక విజేత, భారత షూటర్‌ అపూర్వి చండేల కరోనాపై యుద్ధానికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది.  రూ.3లక్షలను పీఎం-కేర్స్‌ నిధికి, రూ.2లక్షలను రాజస్థాన్‌ సీఎం సహాయ నిధికి అందించినట్టు గురువారం తెలిపింది.


logo