బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 07, 2020 , 21:26:20

కోహ్లీ VS‌ గంభీర్..కెప్టెన్సీపైనే ఎందుకీ చర్చ?

కోహ్లీ VS‌ గంభీర్..కెప్టెన్సీపైనే ఎందుకీ చర్చ?

హైదరాబాద్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ  నుంచి  విరాట్‌ కోహ్లీని   తొలగించాలని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కోహ్లీ పేలవ ప్రదర్శన, సారథిగా విఫలమవడం తదితర అంశాలపై   మాజీ ఓపెనర్‌ గంభీర్‌  స్పందించాడు.  కోహ్లీపై గంభీర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.  ఐపీఎల్‌ సీజన్‌ వచ్చినప్పుడల్లా వీరిద్దరి మధ్య   మాటల యుద్ధం జరుగుతోంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపై కోహ్లీ ఎమోషన్‌ ట్వీట్‌ మాత్రమే చేశాడు. గంభీర్‌ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం కోహ్లీ, గంభీర్‌ అభిమానులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. 

అప్పుడు..

‘ఐపీఎల్‌లో  కోహ్లీ  చురుకైన కెప్టెన్ ఏమీ  కాదు. అందుకే అతను   బెంగళూరు  జట్టుకు  ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు’  అంటూ    గతేడాదీ గంభీర్    చేసిన   వ్యాఖ్యలపై అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఐపీఎల్‌ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా బెంగళూరు యాజమాన్యం,  కోహ్లీని   కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్‌ సెటైర్లు వేసిన   సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు.  కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్‌ గురించి ఏమాత్రం అవగాహన లేని వారిలా మాట్లాడుతుంటారు  అంటూ గౌతీకి  కౌంటర్‌ కూడా ఇచ్చాడు. 

ఇప్పుడు..

జట్టును ముందుండి నడిపించలేకపోయిన విరాట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని మళ్లీ గంభీర్‌  అభిప్రాయపడటంతో చర్చ మళ్లీ మొదలైంది.   కోహ్లీ కెప్టెన్సీ లక్ష్యంగానే  గంభీర్‌ విమర్శలు చేస్తుండటం గమనార్హం.  కోల్‌కతా‌ నైట్‌రైడర్స్‌కు గంభీర్‌  రెండు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే. 


'ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించకుండా  ఎనిమిదేండ్ల  పాటు కెప్టెన్‌గా  కొనసాగడం చాలా ఎక్కువ.    రోహిత్ శర్మ‌, ధోనీ గురించి మాట్లాడుకుంటున్నామో కోహ్లీ కూడా అంతే.  ధోనీ చెన్నైకి  మూడు సార్లు, రోహిత్‌ ముంబైకి  నాలుగుసార్లు  ట్రోఫీలు  అందించారు. అందుకే వారిని ఇన్నేండ్లుగా   కొనసాగిస్తున్నారు.  సమస్య, బాధ్యత ఏదైనా  కెప్టెన్‌ నుంచే మొదలవ్వాలి.  అది జట్టు యాజమాన్యం లేదా ఇతర సిబ్బంది నుంచి కాదు.  ఒక  సారథిగా  గెలిచినప్పుడు ఎలాగైతే క్రెడిట్‌ దక్కుతుందో  పరాజయపాలైనప్పుడు   కూడా అలాగే విమర్శలు ఎదుర్కోవాలి’ అని  గంభీర్‌ తాజాగా   వ్యాఖ్యానించాడు. 

ఐతే గంభీర్‌ వ్యాఖ్యలపై సందర్భం వచ్చినప్పుడు కోహ్లీ  ఎలా  స్పందిస్తాడో  చూడాలి. ఇంతకీ కోహ్లీ కెప్టెన్సీ కేంద్రంగా గంభీర్‌ ఎందుకు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య సైలెంట్‌ వార్‌ ఏదైనా జరుగుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.