సోమవారం 13 జూలై 2020
Sports - May 17, 2020 , 23:30:46

గంభీర్‌, అఫ్రిది యుద్ధం

గంభీర్‌, అఫ్రిది యుద్ధం

  • -కశ్మీర్‌పై క్రికెటర్ల రగడ

సొగసైన కవర్‌డ్రైవ్‌లతో రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోనూ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌.. పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దశాబ్ద కాలం క్రితం తన బౌలింగ్‌లో బౌండ్రీ బాదిన గంభీర్‌పై నోరు పారేసుకున్న అఫ్రిది.. క్రికెట్‌కు దూరమై ఇన్నాళ్లయినా తన వైఖరిని మాత్రం మార్చుకోలేకపోతున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కే అఫ్రిది.. ఈసారి మరో అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోదీపై అవాకులు చవాకులు పేలాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన గంభీర్‌ గట్టిగా కౌంటర్‌ అందుకున్నాడు. కాన్పూర్‌ వన్డేలో బ్యాట్‌ పట్టుకొని అఫ్రిది మీదుకు దూసుకెళ్లిన గౌతీ.. ఈ సారి ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరి మధ్య సాగుతున్న వివాదంపై ఓ లుక్కేస్తే..  

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

2007 నవంబర్‌ 11.. కాన్పూర్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మూడో వన్డే.. ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు అప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ దశలో మూడో మ్యాచ్‌లో అఫ్రిది బౌలింగ్‌లో గంభీర్‌ బౌండ్రీ బాదాడు. దీంతో ఉడికిపోయిన అఫ్రిది మరుసటి బంతికి బిగ్గరగా అప్పీల్‌ చేశాడు. అదే సమయంలో బంతి స్లిప్స్‌ వైపు వెళ్లడంతో గంభీర్‌ పరుగందుకున్నాడు. ఇది గమనించిన అఫ్రిది కావాలనే అతడి దారికి అడ్డు నిలిచాడు. దీంతో గౌతీ.. అతడిని గుద్దుకుంటూ వెళ్లి క్రీజులోకి చేరాడు. దీనిపై అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేయడంతో కోపోద్రిక్తుడైన గంభీర్‌ బ్యాట్‌ పట్టుకొని అతడిపైకి దూసుకెళ్లాడు. ఇక అక్కడి నుంచి వీరిద్దరూ మైదానంలో ఎప్పుడు ఎదురుపడ్డా వాతావరణం వేడెక్కేది.

వీడ్కోలు పలికాక కూడా..

ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వీరిద్దరి మధ్య రైవల్రీ పెరిగిందే తప్ప తగ్గలేదు. పేద ప్రజలకు సాయం చేయడం, దేశసేవ వంటి అంశాల్లో చురుకుగా ఉండే గంభీర్‌ పలుమార్లు సామాజిక మాధ్యమాల వేదికగా అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కశ్మీర్‌ కీ ఆజాదీ’ పేరుతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అఫ్రిది.. తన ఆత్మ కథ ‘ది గేమ్‌ చేంజర్‌'లో గంభీర్‌పై తన అక్కసునంతా వెల్లగక్కాడు. గౌతమ్‌కు వ్యక్తిత్వం లేదని, అతడికి పొగరెక్కువ అని అతడు పెద్దగా ఏం సాధించకున్నా.. బ్రాడ్‌మన్‌లా బిల్డప్‌ ఇస్తాడని రాసుకొచ్చాడు. దీనికి గౌతీ పరుషమైన పదాలతో బదులిచ్చాడు. అబద్ధాలు ఆడేవారు, విద్రోహులు, అవకాశవాదుల పట్ల తన ప్రవర్తన అలాగే ఉంటుందని చెంప చెల్లుమనిపించాడు.

సేవలో ముందు

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటి నుంచి సమాజ సేవలో నిమగ్నమైన గంభీర్‌ దేశ రక్షణలో అమరులైన సైనికుల పిల్లలను చదివించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఇక అప్పటి నుంచి అఫ్రిది చేస్తున్న వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణాలను బటయపెడుతున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన అఫ్రిది ఆ దేశ సైనికులతో కలిసి భారత ప్రధానిపై నోరు పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందు లో ‘ప్రపంచం మొత్తం పెద్ద వ్యాధితో పోరాడుతున్నది, అంతకన్నా ప్రమాదకరమైన వ్యాధి మోదీ మెదడు, హృదయం’ అంటూ కారుకూతలు కూశాడు. దీనిపై తాజాగా గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువరాజ్‌, హర్భజన్‌ కూడా గంభీర్‌కు మద్దతు తెలుపుతూ.. అఫ్రిదిని ఎండగట్టారు.

70 ఏండ్లుగా ఏం చేస్తున్నారు..

పాక్‌ ప్రజలను మభ్యపెట్టేందుకే అఫ్రిది విషం చిమ్ముతున్నాడని గౌతీ ట్వీట్‌ చేశాడు. ‘20 కోట్ల మంది ప్రజల మద్దతుతో 7 లక్షల సైన్యం పాకిస్థాన్‌కు ఉందని 16 ఏండ్ల షాహిద్‌ అఫ్రిది అంటున్నాడు. అయినా 70 ఏండ్లుగా కశ్మీర్‌ కోసం అడుక్కుంటూనే ఉన్నారుగా. పాకిస్థాన్‌ ప్రజలను మభ్య పెట్టేందుకు, మోసం చేసేందుకు అఫ్రిది, ఇమ్రాన్‌ (పాక్‌ ప్రధాని), బాజ్వా (పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌) లాంటి జోకర్లు భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్మగలరు. అంతేకాని యుగాంతం వరకు కశ్మీర్‌ను సొంతం చేసుకోలేరు! బంగ్లాదేశ్‌ను గుర్తు తెచ్చుకోండి అని గంభీర్‌  ట్వీట్‌ చేశాడు.


logo