సోమవారం 25 జనవరి 2021
Sports - May 22, 2020 , 21:04:00

రాయుడును త‌ప్పించ‌డం ఎమ్మెస్కే త‌ప్పే: గ‌ంభీర్‌

రాయుడును త‌ప్పించ‌డం ఎమ్మెస్కే త‌ప్పే: గ‌ంభీర్‌


న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్‌.. భార‌త మాజీ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌పై మ‌రోసారి మండిప‌డ్డాడు. అతడు ఎంద‌రో ఆట‌గాళ్ల కెరీర్‌తో ఆట‌లాడుకున్నాడ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. ముఖ్యంగా గతేడాది ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అంబ‌టి రాయుడును ఎంపిక చేయ‌క పోవ‌డంపై గంభీర్ త‌ప్పుబ‌ట్టాడు. అంతేకాకుండా క‌రుణ్ నాయ‌ర్‌, సురేశ్ రైనా, యువ‌రాజ్‌సింగ్ వంటి వారిని క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండానే జ‌ట్టు నుంచి త‌ప్పించాడ‌ని గంభీర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. శుక్ర‌వారం ఓ షోలో గంభీర్ మాట్లాడుతూ..

`2016లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు అనంత‌రం న‌న్ను జ‌ట్టు నుంచి త‌ప్పించిన‌ప్పుడు ఒక్క మాటైనా చెప్ప‌లేదు. నా ఒక్క‌డి ప‌ట్ల మాత్ర‌మే ఇలా జ‌రగ‌లేదు. క‌రుణ్ నాయ‌ర్‌, యువ‌రాజ్ సింగ్‌, సురేశ్ రైనా కూడా ఇలాంటి అనుభ‌వాలే చ‌విచూశారు. అంబ‌టి రాయుడు విష‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. రెండు మూడేండ్లుగా అత‌డిని ప్రోత్స‌హించి.. తీరా ప్ర‌పంచ‌క‌ప్ వంటి మెగాటోర్నీకి ముందు 3డీ ప్లేయ‌ర్ అంటూ మ‌రొక‌రిని తెర‌పైకి తేవ‌డంఎంత వ‌ర‌కు స‌రైన నిర్ణ‌యం` అని మండిప‌డ్డాడు. 

ఇక 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు జ‌ట్టును సెలెక్ట్ చేసిన సంద‌ర్భంలో ఎమ్మెస్కే ప్ర‌సాద్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ మూడు అంశాల్లో ప‌నికొస్తాడ‌నే విజ‌య్ శంక‌ర్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు. ఇంగ్లండ్ వంటి పిచ్‌ల‌పై ఇలాంటి త్రీ డైమెన్ష‌న్ ప్లేయ‌ర్స్ ఉంటే జ‌ట్టుకు అద‌న‌పు ప్ర‌యోజనం చేకూరుతుంద‌ని చెప్పి రాయుడుకు మొండిచేయి చూపించాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన అంబ‌టి రాయుడు.. మెగాటోర్నీ చూసేందుకు 3డీ గ్లాస్‌లు ఆర్డ‌ర్ ఇచ్చాన‌ని సామాజిక మాధ్యమాల్లో పేర్కొని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.


logo