సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 00:17:04

గాఫ్‌ గర్జన

గాఫ్‌ గర్జన

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం. పదిహేనేండ్ల యువ సంచలనం కోరీ గాఫ్‌ చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక పరాజయం పాలైతే.. టైటిల్‌పై కన్నేసిన వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ అన్‌సీడెడ్‌ ముందు నిలువలేక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ రోజర్‌ ఫెదరర్‌ కష్టంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెడితే.. నొవాక్‌ జొకోవిచ్‌ అలవోకగా నెగ్గి ముందంజ వేశాడు.

  • నవోమి చిత్తుచేసిన అమెరికా యువ సంచలనం
  • సెరెనాకు వాంగ్‌ షాక్‌.. ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్‌, జొకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఇప్పటి వరకు అంచనాలకు అనుగుణంగా సాగుతూ వచ్చిన సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుక్రవారం అనూహ్య ఫలితాలు వచ్చా యి. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మార్గరేట్‌ కోర్ట్‌ సరసన నిలువాలని భావించిన అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్‌లో ఓటమి పాలైతే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక (జపాన్‌)కు యువ సంచలనం కోరీ గాఫ్‌ షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్‌ (సెర్బియా), ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెడితే.. సిట్సిపాస్‌ (గ్రీస్‌) మూడో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.


దుమ్మురేపిన గాఫ్‌

అమెరికా నయా స్టార్‌ కోరీ గాఫ్‌ అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తున్నది. రెండో రౌండ్‌లో క్రిస్టియా (రొమేనియా)పై నెగ్గి జోరుమీదున్న గాఫ్‌.. మూడో రౌండ్‌లో కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఒసాకాను వరుస సెట్లలో మట్టి కరిపించింది. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగిన గాఫ్‌ మూడో రౌండ్‌లో 6-3, 6-4తో ఒసాకపై గెలుపొందింది. పదిహేనేండ్ల గాఫ్‌ దూకుడు ముందు ఒసాక ఎదురు నిలువలేక పోయింది. గంటా 7 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్‌ నాలుగు బ్రేక్‌ పాయింట్లలో మూడింటిని వినియోగించుకుంది. ‘రెండేండ్ల క్రితం జూనియర్‌ స్థాయిలో ఇక్కడ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యా.. ఇప్పుడు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది’ అని గాఫ్‌ పేర్కొంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-3, 6-2తో రైబకినా (రష్యా)పై అలవోక విజయంతో ముందడుగు వేయగా.. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-1, 6-2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గింది. 


ఫెదరర్‌ కష్టకష్టంగా..

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ రోజర్‌ ఫెదరర్‌ 4-6, 7-6 (7/2), 6-4, 4-6, 7-6 (10/8)తో జాన్‌ మిల్‌మెన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 4 గంటల 3 నిమిషాల పాటు సాగిన పోరులో ఫెదరర్‌ అతికష్టం మీద సూపర్‌ టై బ్రేకర్‌లో గట్టెక్కాడు. రోజర్‌ 16 ఏస్‌లు సంధించి 6 డబుల్‌ ఫాల్ట్స్‌ చేస్తే.. ప్రత్యర్థి 11 ఏస్‌లు కొట్టి 4 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశాడు. అయితే కీలక దశలో రెండు టైబ్రేక్‌ పాయింట్లు నెగ్గిన ఫెదరర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెదరర్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఇది వందో విజయం కావడం విశేషం. ‘సూపర్‌ టై బ్రేకర్‌ లేకపోయుంటే.. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యేవాడినే’ అని మ్యాచ్‌ అనంతరం రోజర్‌ అన్నాడంటే పోరు ఎంత క్లిష్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇతర మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో నిషియోక (జపాన్‌)పై గెలుపొందగా.. మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6-7 (3/7), 6-4, 6-0, 5-7, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ బటిస్టా అగట్‌ (స్పెయిన్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరారు.పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌ రెండో రౌండ్‌లో వెనుదిరిగాడు. 


అయ్యో సెరెనా..


టైటిల్‌ వేటలో ప్రధాన పోటీదారులా కనిపించిన సెరెనా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో 4-6, 7-6 (7/2), 5-7తో వాంగ్‌ క్యాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌లో ఓడిన సెరెనా.. రెండో సెట్‌లో పుంజుకున్నా నిర్ణయాత్మక సెట్‌లో చైనా ప్లేయర్‌ ఆధిపత్యం ముందు నిలువలేకపోయింది. 2 గంటలా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సెరెనా 8 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్‌ ఫాల్ట్స్‌ చేస్తే.. వాంగ్‌ 2 ఏస్‌లతో పాటు ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. బిడ్డకు జన్మనిచ్చాక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గాలనుకున్న సెరెనా ఆశ ఈసారి కూడా నెరవేరలేదు.


వోజ్నియాకి వీడ్కోలు


ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్‌) మూడో రౌండ్‌ ఓటమితో కెరీర్‌ ముగించింది. శుక్రవారం జరిగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ వోజ్నియాకి 5-7, 6-3, 5-7తో జాబేర్‌ (ట్యూనిషియా) చేతిలో ఓడింది. ‘గ్రాండ్‌స్లామ్‌ నెగ్గాలని చిన్నప్పుడు కలలు కనేదాన్ని. ప్రపంచ నంబర్‌వన్‌గా నిలువాలని అనుకున్నా అది సాధ్య పడింది’ అని మ్యాచ్‌ అనంతరం వోజ్నియాకి ఉద్వేగానికి గురైంది. చిరకాల స్నేహితురాలు, ప్రియమైన ప్రత్యర్థి సెరెనాను కౌగిలించుకొని కన్నీరు పెట్టిన ఈ డెన్మార్క్‌ స్టార్‌.. తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.


logo