ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 15, 2020 , 18:00:18

ఏడు నిమిషాల్లోనే కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్‌

ఏడు నిమిషాల్లోనే కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్‌

న్యూ ఢిల్లీ: తాను ఏడు నిమిషాల్లోనే ప్రతిష్టాత్మకం టీం ఇండియా కోచ్‌గా ఎంపికయ్యానని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ క్రిస్టన్‌ పేర్కొన్నాడు. అతడిని కోచ్‌ పదవి ఎలా వరించిందో నెమరేసుకున్నాడు. క్రికెట్‌ కలెక్టివ్‌ ప్యాడ్‌కాస్ట్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. ‘నాకు ఇండియన్‌ క్రికెట్‌ టీం కోచ్‌ ఎంపిక ప్యానెల్‌లో ఉన్న సునీల్‌ గవాస్కర్‌ నుంచి ఈ మెయిల్‌ వచ్చింది. నువ్వు మా టీంకు కోచ్‌గా చేస్తావా? అని గవాస్కర్‌ అడిగాడు. జోక్‌ చేయడం లేదు గదా అని నేనన్నా. ఆయన వెంటనే ఇంటర్వ్యూకు ఆహ్వానించాడు. ఇదే విషయం నా భార్యకు చెబితే నేను అనర్హుడినని అంది’ అంటూ క్రిస్టన్‌  పేర్కొన్నాడు.

  తాను ఇండియా వెళ్లగానే బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు అప్పటి ఇండియా కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే ఎదురయ్యాడని క్రిస్టన్‌ తెలిపాడు. ‘నువ్విక్కడేం చేస్తున్నావ్‌’ అని ప్రశ్నించగా, మీకు శిక్షణ ఇచ్చేందకు ఇంటర్వ్యూకు వచ్చానని తాను సమాధానమివ్వగానే అక్కడ నవ్వులు విరబూశాయని వివరించాడు. కోచ్‌ ఎంపిక ప్యానెల్‌ తనను ఏడు నిమిషాలు ఇంటర్వ్యూ చేసిందని గుర్తుచేశాడు. బీసీసీఐ కార్యదర్శితోపాటు ప్యానెల్‌ మెంబర్‌ రవిశాస్త్రి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని తెలిపాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియాతో తలపడ్డప్పుడు గెలుపునకు తన దగ్గర ఉన్న వ్యూహాలను వివరించానని, దానికి సంతృప్తి చెంది కోచ్‌ పదవి అప్పగించారన్నారు. అలా ఎలాంటి దరఖాస్తు చేయకుండానే కేవలం ఏడు నిమిషాల ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్‌ టీం కోచ్‌గా ఎంపికయ్యానని గ్యారీ గుర్తుచేసుకున్నాడు. కాగా, గ్యారీ క్రిస్టన్‌ 2008 నుంచి 2011 వరకు ఇండియన్‌ టీం కోచ్‌గా పనిచేశాడు. అతడి కృషి వల్లే 2009లో భారత క్రికెట్‌ జట్టు ఉత్తమ ర్యాంకింగ్స్‌ సాధించగలిగింది. అలాగే, 2011లో రెండో వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకున్నది.logo