మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 20:35:13

పాక్‌ టూర్‌లో ధోనీ ఉండాలని దాదా కోరుకున్నాడు: జాన్‌ రైట్‌

పాక్‌ టూర్‌లో  ధోనీ ఉండాలని దాదా కోరుకున్నాడు: జాన్‌ రైట్‌

న్యూఢిల్లీ: 2004 పాకిస్థాన్‌ పర్యటనలో మహేంద్ర సింగ్‌ ధోనీని జాతీయ జట్టులోకి తీసుకోవడానికి భారత కెప్టెన్‌గా సౌరభ్‌  గంగూలీ చాలా  ప్రయత్నించాడని  అప్పటి భారత కోచ్‌ జాన్‌ రైట్‌ తెలిపాడు.  మూడు టెస్టుల సిరీస్‌కు మరో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పార్థీవ్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. '2004లో  పాకిస్థాన్‌ పర్యటనలో  ధోనీని జట్టులో చేర్చుకోవడానికి సౌరభ్‌ చాలా ఆసక్తి చూపించాడు.  మేము విజయవంతమైన టెస్టు జట్టును ఎన్నుకున్నామని' రైట్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 

'సౌరభ్‌లో మంచి విషయాలు చాలా ఉన్నాయి. జట్టు ఎంపిక సమయంలో అతడు యువకులకు ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ధోనీ పాకిస్థాన్‌ పర్యటనకు ఎంపిక చేయబడి ఉంటే ఆ తర్వాతి పరిస్థితులు ఎలా ఉండేవో మీకు తెలియదు. అది నేను అతని గురించి మొదటగా వినడం ప్రారంభించినప్పుడు' అంటూ రైట్‌ గుర్తుచేసుకున్నాడు. 

'ధోనీ చాలా అద్భుతమైన క్రికెటర్‌ మాత్రమే కాదు. చాలా తెలివైన వాడు కూడా.  ఎదుటివాళ్లు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినేవాడు.తన ఫస్ట్‌ సిరీస్‌లో పెద్దగా ఏమీ చెప్పలేదు. కానీ అన్ని సమయాల్లోనూ ప్రతి విషయాన్ని గమనిస్తూ నేర్చుకున్నాడు. అతనికి మంచి భవిష్యత్‌ ఉందని నేను ఆ సమయంలోనే అనుకున్నాను' అని రైట్‌ పేర్కొన్నాడు. 


logo