సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 17, 2021 , 00:30:07

వరుణుడి ఆటంకం

వరుణుడి ఆటంకం

  • ఒక సెషన్‌ ముందే నిలిచిన ఆట
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 62/2  
  • ఆస్ట్రేలియా 369 ఆలౌట్‌

అనుభవం పెద్దగా లేకున్నా.. ఆకట్టుకునే ప్రయత్నం చేసిన భారత బౌలర్లు.. కంగారూలను నాలుగొందల లోపు కట్టడిచేసి టీమ్‌ఇండియాకు అవకాశాలు సృష్టించారు. ఉపఖండాన్ని పోలి ఉన్న వికెట్‌పై మన బ్యాటింగ్‌ ఆర్డర్‌ అదరగొడితే ఇక ఢోకా లేదనుకుంటే.. మంచి ఆరంభం లభించాక హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు. ఇక సీనియర్లపైనే భారం అనుకుంటున్న దశలో నేనున్నానంటూ వరుణుడు దూసుకొచ్చి రెండో రోజు ఆటను ముగించాడు. మరి మూడోరోజు మనవాళ్లు ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని ఎదుర్కొంటూ ఎన్ని పరుగులు చేస్తారనేది ఆసక్తికరం ! 

బ్రిస్బేన్‌: సెషన్‌ల వారిగా ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న ఆఖరి టెస్టులో వరుణుడు కూడా ఓ సెషన్‌ ఆటను ఆక్రమించాడు. గబ్బా వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు భారీ వర్షం కారణంగా రెండు సెషన్‌ల ఆట మాత్రమే సాధ్యమైంది. శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో నటరాజన్‌, శార్దుల్‌, సుందర్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా.. ఆట నిలిచే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (44; 6 ఫోర్లు) ఫర్వాలేదని పించాడు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న భారత జట్టు కంగారూల స్కోరుకు ఇంకా 307 పరుగులు వెనుకబడి ఉంది. టెస్టు స్పెషలిస్టులు చతేశ్వర్‌ పుజారా (8), అజింక్యా రహానే (2) క్రీజులో ఉన్నారు. 

95 రన్స్‌.. 5 వికెట్స్‌

274/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ జట్టు.. మరో 95 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ (47) క్రీజులో అడుగుపెట్టడంతోనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలి ఓవర్‌ వేసిన నటరాజన్‌కు రెండు బౌండ్రీలతో స్వాగతం పలికిన అతడు ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించాక శార్దుల్‌ ఈ జోడీని విడదీశాడు. మరుసటి ఓవర్‌లో గ్రీన్‌ అతడిని అనుసరించాడు. శార్దుల్‌ వేసిన మరుసటి ఓవర్‌లో కమిన్స్‌ (2) వికెట్ల ముందు దొరికిపోవడంతో ఆస్ట్రేలియా 4 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి 315/8తో నిలిచింది. మరికాసేపట్లో కంగారూల ఖేల్‌ ఖతం కావడం ఖాయమనుకుంటే.. స్టార్క్‌ (20 నాటౌట్‌), లియాన్‌ (24) ఎదురుదాడికి దిగారు. బౌండరీలతో విరుచుకుపడిన ఈ జంట తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించి ఆసీస్‌ స్కోరును 350 దాటించింది. ఆఖర్లో హజిల్‌వుడ్‌ (11) కూడా బ్యాట్‌కు పనిచెప్పగా.. సుందర్‌, నటరాజన్‌ చెరో వికెట్‌ తీసి కంగారూలను ఆలౌట్‌ చేశారు. 

రోహిత్‌ తొందరపాటు

అచ్చిరాని వేదికపై భారత్‌కు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్‌ గిల్‌ (7) ఏడో ఓవర్‌లోనే పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో భారత జట్టు 11 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత పుజారాతో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే అర్ధశతకానికి చేరువైన అనంతరం రోహిత్‌ అనవసరపు షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. లియాన్‌ లెగ్‌స్టంప్‌పై వేసిన ఊరించే బంతిని బౌండ్రీ దాటించాలనుకున్న హిట్‌మ్యాన్‌ లాంగాన్‌లో స్టార్క్‌ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రహానే ఆచితూచి ఆడాడు. రోహిత్‌ ఔటయ్యాక 6.1 ఓవర్లు క్రీజులో నిలిచిన ఈ జంట రెండు పరుగులు మాత్రమే చేసి టీ విరామానికి వెళ్లింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల అనంతరం వరుణుడు తెరిపినిచ్చినా.. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు పలుమార్లు పరిశీలించాక ఆటను నిలిపివేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేశాక.. ఆసీస్‌ జట్టు గబ్బా వేదికగా ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఓడలేదు. 

అరగంట ముందుగానే..

భారీ వర్షం కారణంగా రెండో రోజు ఒక సెషన్‌ మొత్తం తుడిచి పెట్టుకుపోవడంతో మిగిలిన మూడు రోజులు  అరగంట ముందుగానే ఆట ఆరంభం కానుంది. అంటే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకే భారత ప్లేయర్లు క్రీజులో అడుగుపెట్టనున్నారు. 

 చెత్త షాట్‌ ఎందుకు ఆడావ్‌?

ఎందుకు? ఎందుకు? ఎందుకు?? అదో బాధ్యతారహితమైన షాట్‌. నేను నమ్మలేకపోతున్నా. డీప్‌ స్కేర్‌ లెగ్‌లో ఫీల్డర్‌ ఉన్నాడు. అంతకుముందే రెండు బౌండరీలు బాది.. తర్వాత ఎందుకు ఆ షాట్‌ ఆడావు. నువ్వు సీనియర్‌ ఆటగాడివి. ఈ తప్పిదాన్ని ఉపేక్షించేదిలేదు. అనవసరంగా ఓ వికెట్‌ పోయింది.       - గవాస్కర్‌

ఆ షాట్‌ ఆడినందుకు బాధలేదు

నేను ఎలా ఆడాలనుకున్నానో అలాగే ఆడా. ఆ షాట్‌ ఆడినందుకు బాధపడటం లేదు. భారీ షాట్‌ ఆడి బౌలర్‌పై ఒత్తిడి పెంచాలనుకున్నా. ఆ తరహాలో నేను గతంలో ఎన్నో పరుగులు రాబట్టా. ఇప్పుడూ అదే చేయాలనుకున్నా. లియాన్‌ వేసిన బంతిని స్టాండ్స్‌లో పడేయాలనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు క్యాచ్‌ ఔట్‌ అయ్యా.

- రోహిత్‌ శర్మ

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 1, హరీస్‌ (సి) సుందర్‌ (బి) శార్దుల్‌ 5, లబుషేన్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 108, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) సుందర్‌ 36, వేడ్‌ (సి) శార్దుల్‌ (బి) నటరాజన్‌ 45, గ్రీన్‌ (బి) సుందర్‌ 47, పైన్‌ (సి) రోహిత్‌ (బి) శార్దుల్‌ 50, కమిన్స్‌ (ఎల్బీ) శార్దుల్‌ 2, స్టార్క్‌ (నాటౌట్‌) 20, లియాన్‌ (బి) సుందర్‌ 24, హజిల్‌వుడ్‌ (బి) నటరాజన్‌ 11, ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 369 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-4, 2-17, 3-87, 4-200, 5-213, 6-311, 7-313, 8-315, 9-354, 10-369, బౌలింగ్‌: సిరాజ్‌ 28-10-77-1, నటరాజన్‌ 24.2-3-78-3, శార్దుల్‌ 24-6-94-3, సైనీ 7.5-2-21-0, సుందర్‌ 31-6-89-3, రోహిత్‌ 0.1-0-1-0.భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) లియాన్‌ 44, గిల్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 7, పుజారా (నాటౌట్‌) 8, రహానే (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 62/2. వికెట్ల పతనం: 1-11, 2-60, బౌలింగ్‌: స్టార్క్‌ 3-1-8-0, హజిల్‌వుడ్‌ 8-4-11-0, కమిన్స్‌ 6-1-22-1, గ్రీన్‌ 3-0-11-0, లియాన్‌ 6-2-10-1.

VIDEOS

logo