బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 15:26:31

కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!

కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!

సిడ్నీ: ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడం కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు  తరచూ ఉపయోగించే  ఆయుధం స్లెడ్జింగ్.  ప్రత్యర్థులపై రెచ్చగొట్టే, చెత్త  కామెంట్లు చేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆ జట్టు ప్రయత్నిస్తూ ఉంటుంది. తమ దేశ పర్యటనకు వచ్చిన విదేశీ ఆటగాళ్లను ఆస్ట్రేలియా మీడియా కూడా  టార్గెట్ చేస్తుంటుంది. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత మైదానంలో ఆసీస్‌ ఆటగాళ్ల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.  కానీ, ప్రస్తుత పర్యటనలో జాత్యహంకార వివాదం మరోసారి తీవ్రమైంది. సిడ్నీ టెస్టులో కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు రౌడీ ప్రవర్తనతో భారత ఆటగాళ్లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగించారు. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని ఆసీస్‌ అల్లరిమూక రెచ్చిపోయింది.  

మైదానం లోపల, బయట  దూకుడుగా వ్యవహరించే టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ  ఉంటే కథ వేరేలా ఉండేదని, ఇలాంటి వాటికి వాళ్ల భాషలోనే    దీటుగా బదులిచ్చేవాడని అభిమానులు అంటున్నారు.  ఆతిథ్య ప్రేక్షకులు భారత క్రికెటర్లపై చేసిన జాతివివక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు డిమాండ్ చేస్తున్నారు.

అలాంటోళ్లకు   కోహ్లీనే సరైనోడు 

విరాట్‌ కోహ్లీ  భారత్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. మైదానంలో యాక్టివ్‌గా ఉండే విరాట్‌ తనను కవ్వించే వారికి తనదైనశైలిలో బదులిచ్చేవాడు.  దీంతో గత కొన్నేండ్లుగా భారత్‌..ఆసీస్‌ పర్యటనకు వచ్చే ముందు   విరాట్‌ను రెచ్చొగొట్టదంటూ ఆ దేశ మాజీలు తమ దేశ ఆటగాళ్లకు హితబోధ చేస్తున్నారు.  ఆస్ట్రేలియా మీడియా కూడా కోహ్లీ ప్రవర్తన గురించి చాలాసార్లు కథనాలు ప్రచురించింది. స్లెడ్జింగ్‌ వ్యూహాలు విరాట్‌ ముందు పనిచేయవని భావించిన కంగారూలు ఇక వెనక్కితగ్గారు.  ప్రస్తుత పర్యటనలో తొలి టెస్టు మాత్రమే ఆడిన విరాట్‌ తన భార్య అనుష్క  బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు స్వదేశానికి వచ్చాడు.  విరాట్‌ గైర్హాజరీలో టీమ్‌ఇండియాపై సులభంగా గెలవొచ్చని ఆసీస్‌ అనుకున్నది. కానీ, రహానె సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తున్నది.  

మీడియా రాద్ధాంతం 

గత సిరీస్‌లోనూ ఆసీస్ జట్టు స్లెడ్జింగ్‌కు పాల్పడింది. అయినప్పటికీ భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.   ఈసారి ట్రోఫీని నిలబెట్టుకోవాలని భారత్‌ కసిగా ఉంది.  తొలి టెస్టులో దారుణ పరాభవం తర్వాత రెండు టెస్టులో గట్టిగా పుంజుకొని విజయం సాధించింది భారత్‌. సిరీస్‌ సమం కావడంతో ట్రోఫీ  మరోసారి చేజారే ప్రమాదం ఉందని భావించిన ఆసీస్‌ అభిమానులు, ఆదేశ మీడియా టీమ్‌ఇండియా క్రికెటర్లను టార్గెట్‌ చేసింది. కొద్దిరోజులు ఆటగాళ్లు బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించారని ప్రధాన ప్రసారమాధ్యమాలు, సోషల్‌మీడియా పెద్ద రాద్ధాంతం చేసింది. అయినా అవేమీ పట్టించుకోని రహానె సేన తమ ఆటపైనే దృష్టిపెట్టింది. చివరి రెండు టెస్టుల్లో  భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలకు దిగారు. ముఖ్యంగా  హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తున్నది.

  

మారని ఆసీస్‌ ప్రేక్షకుల తీరు

సిడ్నీ టెస్ట్‌లో ప్రధాన పేసర్‌ బుమ్రా, సిరాజ్‌ను ఉద్దేశించి  జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు.  బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న కీలకమైన చివరి టెస్టులోనూ ఆసీస్‌ ప్రేక్షకులు మరింత రెచ్చిపోయారు. మ్యాచ్‌ తొలి రోజు సిరాజ్‌తో పాటు యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను  ఉద్దేశించి ‘గలీజోళ్లు’ అంటూ హేళన చేశారు.    గతంలో మైదానంలో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యర్థులపై స్లెడ్జింగ్‌ వ్యూహాలను అమలు చేసేవారు. కానీ ఇప్పుడు అభిమానులే ఆటగాళ్లను తిట్టడం, వేళాకోళం చేయడం ఎక్కువైంది. మైదానంలో భారత్‌ను అడ్డుకోలేని  ఆస్ట్రేలియా..ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడం ద్వారా పైచేయి సాధించాలని భావిస్తోందని సోషల్‌మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. 


విరాట్‌ను రెచ్చగొడితే..!

ఆస్ట్రేలియా గడ్డపై  జరిగే  ప్రతి సిరీస్‌కు ముందు ప్రత్యర్థి జట్టులోని ప్రధాన ఆటగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు.   ఎంతో అనుభవం ఉన్న  ఆటగాళ్లు కూడా వారి స్లెడ్జింగ్‌ వ్యూహానికి బలైపోయేవారు. తమ జట్టును ఉత్సాహపరచడంలో ముందుండే ఆసీస్‌ అభిమానులు విదేశీ ఆటగాళ్లను  రెచ్చగొడుతూ   చికాకు తెప్పించాలనుకుంటారు. కొన్నేండ్ల క్రితం టీమ్‌ఇండియా..ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో భారత్‌ దారుణంగా విఫలమైంది.   అదే టూర్‌లో కోహ్లీ  ఓ మ్యాచ్‌లో   బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ ఆస్ట్రేలియా అభిమాని అతడిని ఏదో కామెంట్ చేశాడు. అతడికి కోహ్లీ తన మధ్య వేలు చూపించాడు. 

అసలేంటీ మంకీ గేట్‌..!

2008లో జరిగిన 'మంకీ గేట్‌' వివాదం క్రికెట్‌  అభిమానులెవరూ  మరిచిపోలేరు.  భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదంపై తీవ్ర దుమారం రేగింది.  2007-08 ఆసీస్‌ టూర్‌లో  సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్‌ సింగ్‌ తనను మంకీ అంటూ వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశాడని  సైమండ్స్ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. మ్యాచ్‌ రిఫరీ భజ్జీపై   50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు.  ఈ వ్యవహారంలో హర్భజన్‌ ఎలాంటి తప్పుచేయలేదని  అప్పటి భారత ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు.