గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 15:24:04

ఇంజ్యూరీ ప్రీమియర్‌ లీగ్‌గా మారిన ఐపీఎల్‌!

ఇంజ్యూరీ ప్రీమియర్‌ లీగ్‌గా మారిన ఐపీఎల్‌!

దుబాయ్‌: కరోనా సంక్షోభంలోనూ  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది.  ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్‌ అభిమానుల నుంచి విశేషాదరణ లభిస్తుండటంతో లీగ్‌ విజయవంతంగా నడుస్తున్నది. లీగ్‌ ఆరంభమై కనీసం వారం రోజులు కూడా పూర్తికాకముందే ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది.  

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఇప్పటి వరకు  కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మినహా మిగతా జట్లన్నీ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాయి. లాక్‌డౌన్‌,  చాలా రోజుల పాటు ఆటగాళ్లు ఆటకు దూరంగా ఉండటంతో ప్రాక్టీస్‌, మ్యాచ్‌ మధ్యలో గాయపడుతున్నారు.   కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతుండగా.. సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో చీలమండ గాయంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు.  సన్‌రైజర్స్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ తొడ కండరాల గాయంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడో లేదో అనుమానంగానే ఉంది.

ముంబై ఇండియన్స్‌తో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో  అంబటి రాయుడు (71: 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగి చెన్నై జట్టుకు విజయాన్నందించాడు. అదే మ్యాచ్‌లో అతడి కండరాలు పట్టేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని,  మరో మ్యాచ్‌కు కూడా అడే అవకాశం లేదని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. 

సెప్టెంబర్‌ 10న సీపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బ్రావో మోకాలికి గాయమైంది. ఆ మ్యాచ్‌ ఆడినప్పటికీ  బౌలింగ్‌ చేయలేదు. గాయం కారణంగానే చెన్నై ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ బంతితో రాణిస్తుండటంతో బ్రావోకు మరికొన్ని రోజుల పాటు విశ్రాంతినివ్వాలని చెన్నై భావిస్తోంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 13వ సీజన్‌లో  తన తొలి మ్యాచ్‌ తొలి ఓవర్‌ను అద్భుతంగా ఆరంభించాడు.  మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్‌ బాదిన బంతిని ఆపేందుకు డైవ్‌ చేయగా   నేలపై పడటంతో తన భుజానికి బలమైన గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. డీసీ ఆడే తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడతాడో లేదో తెలియదు.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు  పేసర్‌ ఇషాంత్‌ శర్మకు వెన్నునొప్పి కావడంతో ఢిల్లీ తరఫున బరిలో దిగలేకపోయాడు. ఐతే అతని గాయంపై ఎలాంటి సమాచారం లేదు.  ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరీస్‌ కూడా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు   పక్కటెముకలు పట్టేయడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.