ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 02:20:35

స్టార్ల ముందడుగు .. సెరెనా కొంచెం కష్టంగా..

స్టార్ల ముందడుగు .. సెరెనా కొంచెం కష్టంగా..

పారిస్‌: రికార్డుల వేటలో ఉన్న స్పెయిన్‌ స్టార్‌, క్లే కోర్ట్‌ కింగ్‌ రఫెల్‌ నాదల్‌, అమెరికా తార సెరెనా విలియమ్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో తొలిఅడుగు దాటారు. యూఎస్‌ ఓపెన్‌ విజేత డొమెనిక్‌ థీమ్‌ సైతం ఆరంభ పోరులో అదరగొట్టాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6-4, 6-4, 6-2 తేడాతో ఇగోర్‌ గెరాసిమోవ్‌ (బెలారస్‌)పై వరుస సెట్లలో గెలిచాడు. ఇప్పటి వరకు 12 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన నాదల్‌.. ఈసారి కూడా టైటిల్‌ దక్కించుకుంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రోజర్‌ ఫెదరర్‌ (20) రికార్డును సమం చేస్తాడు. కాగా మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-4, 6-3, 6-3తేడాతో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరాడు. రెండు గంటల ఆరు నిమిషాలు జరిగిన మ్యాచ్‌లో థీమ్‌ ఆసాంతం దూకుడు కనబరిచాడు.ఇక వైల్‌కార్డ్‌ ద్వారా టోర్నీలో అడుగుపెట్టిన  బ్రిటన్‌ సీనియర్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే 1-6, 3-6, 2-6తో తొలి రౌండ్‌లో 16వ సీడ్‌ స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. కాస్పర్‌ రుడ్‌, టామీ పౌల్‌, మెకంజీ మెక్‌డొనాల్డ్‌ కూడా రెండో రౌండ్‌కు చేరారు. 

మార్గరెట్‌ కోర్ట్‌ అత్యధిక టైటిళ్ల (24) రికార్డును చేరుకోవడమే లక్ష్యంగా బరిలో దిగిన సెరెనా విలియమ్స్‌ తొలుత తడబడినా ఆ తర్వాత తన శైలి దూకుడు ప్రదర్శించింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సెరెనా 7-6 (7/2), 6-0 తేడాతో క్రిస్టి అహ్న్‌పై గెలిచింది. తొలి సెట్‌లో రెండుసార్లు వెనుకబడిన సెరెనా ఎట్టకేలకు టైబ్రేకర్‌లో సత్తాచాటింది. ఇక రెండో సెట్‌లో తిరుగులేకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో సెరెనా 11 ఏస్‌లు, 26 విన్నర్లు సాధించగా.. క్రిస్టి ఒక ఏస్‌, 13 విన్నర్లకే పరిమితమైంది. మూడో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) 7-6 (7/2), 6-4తేడాతో వర్వరా గ్రెచేవాపై, ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా 6-3, 7-5తో ఒసానే డోడిన్‌పై గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. కాగా 15వ సీడ్‌ మార్కెటా వొంద్రసోవా (చెక్‌ రిపబ్లిక్‌) 1-6, 2-6తేడాతో ఇగా స్వటెక్‌ (పొలాండ్‌) చేతిలో షాక్‌కు గురైంది.