శుక్రవారం 03 జూలై 2020
Sports - May 16, 2020 , 23:57:02

సచిన్‌ కన్నా విరాట్‌ మిన్న

సచిన్‌ కన్నా విరాట్‌ మిన్న

  • స్మిత్‌ దరిదాపుల్లో లేడు 
  • కోహ్లీపై ప్రశంసలు కురిపించిన కెవిన్‌ పీటర్సన్‌

లండన్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కన్నా.. ఛేజింగ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ మెరుగైన ఆటగాడని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, కోహ్లీ మధ్య ఎవరు ఉత్తమమనే చర్చ సాగుతుంటే.. పీటర్సన్‌ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ దరిదాపుల్లో కూడా స్మిత్‌ లేడని.. విరాట్‌ గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ‘సచిన్‌, కోహ్లీలో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే.. నా ఓటు విరాట్‌కే. లక్ష్యఛేదనలో అతడి బ్యాటింగ్‌ అద్భుతం. 80.00 సగటుతో ఛేజింగ్‌ అంటే మామూలు విషయం కాదు’అని పీటర్సన్‌ అన్నాడు.

దరిదాపుల్లో కూడా లేడు

ఇక స్మిత్‌తో పోలిక విషయంలో కెవిన్‌ మాట్లాడుతూ.. ‘కోహ్లీతో స్మిత్‌కు పోలికా! విరాట్‌ ఛేజింగ్‌లో మొనగాడు. తీవ్రఒత్తిడిలోనూ అతడు టీమ్‌ఇండియాను గట్టెక్కించిన సందర్భాలు కోకొల్లలు. ఈ విషయంలో స్మిత్‌ కనీసం కోహ్లీ దరిదాపుల్లో లేడు. లక్ష్యఛేదనలో కోహ్లీ బ్యాటింగ్‌ చేసే తీరు అద్భుతం. అతడి మనసులో ఎప్పుడూ ఒక్కటే ఉంటుందనుకుంటా.. ఛేజింగ్‌, ఛేజింగ్‌, ఛేజింగ్‌. ఎన్ని ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డులు పొందామనేది ముఖ్యం కాదు. దేశానికి ఎన్ని విజయాలందించామనేదే ప్రధానం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే విరాట్‌ను మించినోడు లేడు’అని పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ 50కిపైగా సగటుతో పరగులు చేస్తున్న విరాట్‌.. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని కెవిన్‌ గుర్తు చేసుకున్నాడు. ఒక్క టెస్టు సగటులో తప్పితే, మిగిలిన అన్ని అంశాల్లో స్మిత్‌.. కోహ్లీకి ఆమడ దూరంలో ఉన్నాడనే విషయం పట్టిక చూస్తే అర్థమవుతుంది. లాక్‌డౌన్‌ ముగిసినా.. మామూలు పరిస్థితులు నెలకొనేంత వరకు సామూహిక శిక్షణ నిర్వహించకూడదని బీసీసీఐ యోచిస్తున్నది.

పరుగులు పెడుతున్న కోహ్లీ..


కరోనా వైరస్‌తో  ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో ప్రస్తుతం క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతుండటంతో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్‌ కూడా చేయలేకపోతున్నారు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత్‌ కెప్టెన్‌  కోహ్లీ.. తిరిగి పరుగు ప్రారంభించాడు. తను నివాసం ఉంటున్న సొసైటీ కాంప్లెక్స్‌లోని ఖాళీ స్థలంలో శనివారం రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. తన సహచర ఆటగాళ్లు షమీ, రాహుల్‌ ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్న నేపథ్యంలో కోహ్లీ కూడా ఈ పనిచేశాడు. కాగా.. ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షల మంది వీక్షించారు. అనంతరం భార్య అనుష్క శర్మతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు.


logo