ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 06, 2020 , 16:18:37

కరోనాతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మృతి

కరోనాతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మృతి

తిరువనంతపురం: కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ సంతోష్‌ ట్రోఫీ మాజీ ఆటగాడు ఈ హంసకోయ (61) శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తిరువనంతపురం వైద్యాధికారి డాక్టర్‌ కే సకీనా ధ్రువీకరించారు. ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఐదుగురికి కూడా పాజిటివ్‌ తేలడంతో అందరినీ మంజేరిలోని దవాఖానలోని కంటైన్మెంట్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈయన మృతితో కేరళలో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 16కు చేరుకొన్నది. 

ఈ నెల 21 న ముంబై నుంచి తిరువనంతపురం వచ్చిన హంసకోయ, ఇతర కుటుంబసభ్యులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తొలుత ఆయన కోడలుకు పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. తర్వాత హంసకోయకు కూడా పాజిటివ్‌గా తేలగా ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించారు. అయితే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్లాస్మా థెరపీ చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు వెంటిలేటర్‌పై రెండురోజులపాటు కొనసాగిన హంసకోయకు గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

మలబార్‌కు చెందిన హంసకోయ.. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌ అంటే మక్కువ పెంచుకొన్నారు. ఉన్నత విద్య చదివే రోజుల్లో కాలికల్‌ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మహారాష్ట్ర తరఫున సంతోష్‌ ట్రోఫిలో (1981-86) పాల్గొన్నారు. అనంతరం జాతీయ జట్టులో చోటుసంపాదించి నెహ్రూ ట్రోపీలో కూడా ఆడారు. మోహన్‌ బగాన్‌, రైల్వేస్‌, టాటా స్పోర్ట్స్‌ వంటి అనేక క్లబ్బులకు ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మెంట్‌ తర్వాత ముంబైలో స్థిరపడిన హంసకోయ మృతిపట్ల పలువురు క్రీడాకారులు సానుభూతి తెలిపారు.


logo