శనివారం 16 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 16:30:58

భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మీర్ సజ్జాద్ అలీ కన్నుమూత‌

భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మీర్ సజ్జాద్ అలీ కన్నుమూత‌

హైద‌రాబాద్ : భార‌త మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మీర్ స‌జ్జాద్ అలీ(66) క‌న్నుమూశారు. అలీకి భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు.  ఆసిఫ్ నగర్‌లోని జెబాబాగ్ నివాసి అయిన‌ సజ్జాద్ అలీ కెరీర్ ప్రారంభంలో స్థానిక లీగ్‌లో బీడీఎల్ తరఫున ఆడాడు. లెఫ్ట్ వింగర్‌గా తన అద్భుత ఆట‌తీరుతో బాగా ప్రాచుర్యం పొందాడు. దీంతో 1977 లో భారతదేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అనంత‌ర కాలంలో ఈ లెఫ్ట్ వింగర్ తూర్పు బెంగాల్ అదేవిధంగా మహ్మదాన్ స్పోర్టింగ్ తరపున ఆడాడు.

స‌జ్జాద్ అలీ మృతిప‌ట్ల‌ మాజీ అంతర్జాతీయ, కోచ్ షబ్బీర్ అలీ సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సజ్జాద్ ఒక జిత్తులమారి వింగర్ అన్నారు. త‌న వేగ‌వంత‌మైన ప‌రుగుతో డిఫెన్స్‌ను త‌గ్గించ‌గ‌ల‌డ‌న్నారు. తూర్పు బెంగాల్, మహ్మదాన్ స్పోర్టింగ్ అదేవిధంగా దేశానికి ఆడుతున్న‌ప్పుడు తాము ఇరువురం ఓ జంట‌గా ఆట‌ను ఆనందించిన‌ట్లు తెలిపారు. 

దేశానికి చెందిన మాజీ అంతర్జాతీయ ఆటగాడు విక్టర్ అమల్ రాజ్ మాట్లాడుతూ.. ఎడమ వైపున తన వేగవంతమైన పరుగులతో సజ్జాద్ ఆకట్టుకునేవాడ‌న్నాడు. ఎడ‌మ‌వైపు నుంచి క్రాస్ చేయ‌డం, అద్భుత‌మైన పాస్‌లు ఇవ్వ‌డంతో పాటు స‌జ్జాద్ గుడ్ బాల్ సెన్స్‌ను క‌లిగి ఉండేవాడ‌ని పేర్కొన్నారు.