బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 00:45:13

పదేండ్ల పాటు పస్తులే..

పదేండ్ల పాటు పస్తులే..

  • భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్‌, అర్జున అవార్డు విజేత సారికా కాలే

న్యూఢిల్లీ:   ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాదాపు పదేండ్ల పాటు తాను పస్తులు ఉన్నానని భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్‌, అర్జున అవార్డు విజేత సారికా కాలే చెప్పారు. అయితే ఖోఖోలో అడుగుపెట్టాక తన జీవితం మారిపోయిందని తెలిపారు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టుకు స్వర్ణం అందించిన సారిక.. ప్రస్తుతం మహారాష్ట్రలో క్రీడా అధికారిగా పని చేస్తున్నారు. ఈ నెల 29న వర్చువల్‌గా జరిగే జాతీయ క్రీడా దినోత్సవంలో ఆమె ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఓ ఇంటర్వ్యూలో సారిక కాలే మాట్లాడారు. ‘ఈ ఏడాది అర్జున అవార్డు వచ్చింది. నేను ఖోఖో ఆడిన రోజులు నాకింకా గుర్తున్నాయి. దాదాపు దశాబ్దం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్ని. నా కుటుంబ పరిస్థితులే నన్ను ఆట వైపు నడిపించాయి. ఖోఖో నా జీవితాన్ని మార్చేసింది. మా అమ్మ మిషన్‌ కుట్టేది, ఇండ్లలో పనిచేసేది. శారీరక సమస్యల కారణంగా మా నాన్న కుటుంబ పోషణకు సరిపడా సంపాదించలేకపోయేవారు. ఖోఖో శిక్షణ శిబిరం, మ్యాచ్‌లు ఉన్న సమయంలోనే ప్రత్యేక డైట్‌ తీసుకునేదాన్ని. ఎన్ని కష్టాలు ఉన్నా కుటుంబం నాకు ఎంతో మద్దతుగా నిలిచింది’ అని కాలే తెలిపారు.   


logo