గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 25, 2020 , 00:36:32

డీన్‌ జోన్స్‌ హఠాన్మరణం

డీన్‌ జోన్స్‌ హఠాన్మరణం

  • ముంబైలో కన్నుమూసిన ఆస్ట్రేలియా దిగ్గజం 
  • ఐపీఎల్‌ విధుల్లోనే ఉంటూ తుదిశ్వాస 

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ హఠాత్తుగా మరణించారు. గురువారం ముంబైలోని ఓ హోటల్‌లో గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 59 ఏండ్ల జోన్స్‌ ఉదయం టిఫిన్‌ చేశాక హోటల్‌ కారిడార్‌లో సహచరులతో ముచ్చటిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అంబులెన్స్‌లో ముంబైలోని హరికిషన్‌ దాస్‌ దవాఖానాకు తరలించినా.. అప్పటికే జోన్స్‌ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ ఇండియా ప్రకటించింది. జోన్స్‌ మృతితో క్రీడా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. మెల్‌బోర్న్‌లో జన్మించిన జోన్స్‌ 1984-1994 మధ్య ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. 1986లో భారత్‌తో మద్రాసులో జరిగిన టెస్టులో ద్విశతకం (210)తో తన అత్యధిక స్కోరు నమోదు చేశారు. వికెట్ల మధ్య వేగవంతమైన పరుగు, మెరుపు ఫీల్డింగ్‌తో ముందుతరాలకు దార్శనికంగా నిలిచారు. ఆ తర్వాత వందల మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించారు. చివరికి క్రికెట్‌కు సేవ చేస్తూనే తుదిశ్వాస విడిచారు. దక్షిణాసియాలో క్రికెట్‌ అభివృద్ధికి కూడా కృషి చేసిన జోన్స్‌ ఆటకు గొప్ప అంబాసిడర్‌గా, ‘ప్రొఫెసర్‌ డీనో’గా కూడా పేరు తెచ్చుకున్నారు. డీన్‌ జోన్స్‌ హఠాన్మరణంతో విషాదంలో మునిగిపోయామని, ఇంకా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని క్రికెటర్లు ట్వీట్లు చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, ఇర్ఫాన్‌ పఠాన్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా అనేక మంది క్రికెటర్లు జోన్స్‌కు నివాళి అర్పించారు.