సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. సిడ్నీలో బుధవారం తెల్లవారుఝామున వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్లో షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్గిల్ కూడా అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు కూడా ఆడాడు.
50 ఏళ్ల మెక్గిల్ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. ఓ వాహనంలో అతన్ని తీసుకెళ్లారు. సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ బిల్డింగ్లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టారు. గన్తో బెదిరించారు. అతని నుంచి వాళ్లు భారీ మొత్తం డిమాండ్ చేశారు. గంట తర్వాత మెక్గిల్ను విడిచి పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మొత్తానికి నలుగురిని అరెస్ట్ చేశారు.